KCR అప్పుడు అపర భగీరథుడు అని.. ఇప్పుడు సున్నా అంటావా..? తుమ్మల నిప్పులు
ఖమ్మం జిల్లాలో పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు చేసింది సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శలు చేయగా ఆయన స్పందించారు. డిపాజిట్ రాని పార్టీని బలోపేతం చేసింది తాను కాదా అని నిలదీశారు.
Tummala Nageswara Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో మాటల తూటాలు పేలుతున్నాయి. పాలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై (Tummala Nageswara Rao) సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ఓడిపోయి ఇంట్లో కూర్చొంటే మంత్రిని చేశానని.. ఎమ్మెల్సీ చేశా.. ఎమ్మెల్యే కూడా చేశానని మండిపడ్డారు. అలాంటి తుమ్మల పార్టీకి చేసింది గుండు సున్నా అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ కామెంట్లపై తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పందించారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కొత్తగూడెంలో మాత్రమే గెలిచిందని తుమ్మల అన్నారు. అప్పుడు పార్టీని బలోపేతం చేయాలని.. తనను బతిమాలితే పార్టీలో చేరానని వివరించారు. ఆ రోజున తనతోపాటు జెడ్పీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీలు, వందల మంది సర్పంచ్లు పార్టీలో చేరింది నిజం కాదా అని అడిగారు. ఖమ్మం జిల్లాలో పార్టీకి డిపాజిట్ రానీ పరిస్థితి నుంచి బలోపేతం చేసింది తాను కాదా అని అడిగారు.
40 ఏళ్ల పరిచయంలో తన నిబద్ధత ఏంటో కేసీఆర్కు తెలుసు.. తెలిసి కూడా తనపై విమర్శలు చేయడం తగదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తాను రుణపడి ఉంటానని.. ఇక్కడి ప్రజల కోసం రాజకీయ విమర్శలను భరిస్తానని తెలిపారు. మనం పార్టీ మారినా ఇంతమంది మనతో రారని ఆ రోజు కేటీఆర్ అనలేదా అని.. తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) చేరిక ప్రభంజనంలా జరిగిందని చెప్పిన విషయం మరచిపోయారా అని అడిగారు.
సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టుల కోసం పార్టీలో చేరానని ఆ రోజే చెప్పానని గుర్తుచేశారు. భక్త రామదాసు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో తనను అపర భగీరథుడు అన్న మాటలను జిల్లా ప్రజలు చూశారని తెలిపారు. పాలేరులో తాను ఓడిపోవడానికి కారణం కేటీఆర్ కారణం అని మీరే చెప్పారు. మా కత్తితో మేమే పొడుచుకున్నానని అప్పట్లో మీడియా ముందు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. లోక్ సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలుపు కోసం తాను కష్టపడ్డానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం శ్రమించలేదా అని అడిగారు.