TS RTC: తెలంగాణ ‘మహాలక్ష్మి’లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న కొత్త బస్సులు
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఎక్స్‌ప్రెస్, రాజధాని AC, లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి.
TS RTC: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఎక్స్‌ప్రెస్, రాజధాని AC, లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించడానికి నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.400 కోట్లతో 1050 కొత్త అధునాతన డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయి. వీటితో పాటు హైదరాబాద్ నగరంలో 540 పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలను, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 500 బస్సులను TSRTC యాజమాన్యం వినియోగంలోకి తీసుకువస్తోంది. దశలవారీగా మార్చి 2024 నాటికి ఈ బస్సులన్నింటినీ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ యోచిస్తోంది.
మహాలక్ష్మి-మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించనున్నారు. శనివారం నుంచి ఆధునిక ఫీచర్లతో 80 కొత్త బస్సులు వినియోగంలోకి రానున్నాయి. వాటిలో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ (నాన్ ఏసీ) బస్సులు ఉన్నాయి. ఈ కొత్త బస్సుల ప్రారంభోత్సవం రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీ శ్రీనివాసరాజు, IAS, రవాణా కమిషనర్ శ్రీ జ్యోతి బుద్ధ ప్రకాష్, IAS, TSRTC MD VC సజ్జనార్ ఇతర సీనియర్ అధికారులు హాజరవుతున్నారు.