గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికులకు తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’(General route pass)కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) శ్రీకారం చుట్టింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ కు రూ.600గా, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1000 గా ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మొదటగా హైదరాబాద్ (Hyderabad) లోని 162 రూట్లలో ఈ పాస్ ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్ పాస్ దారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలువు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్ తో ప్రయాణించవచ్చు.టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ కు రూపకల్పన చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు అనేక రాయితీలను ఆర్టీసీ (RTC)ఇప్పటికే ప్రకటించిందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ (Bajireddy Govarthan) తెలిపారు. ఇప్పుడు ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు జనరల్ రూట్ పాస్ ను సంస్థ ప్రారంభించిందని ఆయన తెలిపారు.(TSRTC) రాష్ట్రంలో విద్యార్థులకు మాత్రమే రూట్ పాస్ లను ఇస్తున్నాం అని, తొలిసారిగా సాధారణ ప్రయాణికులకు ఇవ్వాలని సంస్థ నిర్ణయించిందన్నారు. సాధారణంగా ఆర్డీనరీ రూట్ పాస్ కు రూ.800, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1200 గా ఉంటుందన్నారు. ప్రారంభ నేపథ్యంలో రూ.200 రాయితీని కల్పించి.. సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ ను రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ రూ.1000కే అందిస్తున్నాం అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనర్ (MD VC Sajjanar) తెలిపారు.ఈ పాస్ కు సంబంధించిన రూట్ల వివరాల కోసం http://tsrtc.telangana.gov.in, https://online.tsrtcpass.in వెబ్ సైట్లను సంప్రదించాలని వారు సూచించారు.