ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల.. తెలంగాణలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీని కూడా పెట్టిన ఆమె… తెలంగాణలో తన బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె… తెలంగాణలో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆమె తన పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.
కాగా.. ఈ పాదయాత్రలో ఆమె అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే.. ఆమె చేస్తున్న విమర్శలపై టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. ఏకంగా ప్రివిలేజ్ కమిటీకి షర్మిల వ్యాఖ్యలు పంపి.. చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ షర్మిల వ్యక్తిగత విమర్శలు చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ పోచారం హామీ ఇచ్చారు.
ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం షర్మిలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పీకర్ చర్చించారు. తగిన చర్యలు తీసుకుంటామని, సభ్యుల హక్కులను పరిరక్షిస్తామని స్పీకర్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రుల ఫిర్యాదుపై సభాహక్కుల ఉల్లంఘన కమిటీ బుధవారం సమావేశమయ్యే అవకాశముంది. అయితే ఇప్పటికే షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు.