tourist dies : హిమాచల్ ప్రదేశ్ పారాగ్లైడింగ్‌లో మృతి చెందింది జహీరాబాద్ మహిళ!
హైదరాబాద్‌కు చెందిన టూరిస్ట్ ఒకరు హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో పారా గ్లైడింగ్ చేస్తూ మృతి చెందినట్లు సోమవారం వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి.
Telangana tourist dies in paragliding : జహీరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ జంట విహార యాత్రకని హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. అక్కడి కులూలో భర్త చూస్తుండగానే భార్య పారాగ్లైడింగ్ నుంచి కిందికి పడిపోయి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కి చెందిన సాయి మోహన్, నవ్య(26) దంపతులు ఛత్తీస్‌గఢ్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం వీరికి వివాహం అయ్యింది. వీరు విహార యాత్ర కోసం గత శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ(Kullu)కి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నవ్య పారాగ్లైడింగ్ చేస్తుండగా గాల్లో పారాగ్లైడింగ్ హుక్ ఊడిపోయింది. ఆమె అక్కడి నుంచి ఓ ఇంటి కప్పుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
ఆమెతో పారా గ్లైడింగ్ చేయించిన పైలెట్ మాత్రం ప్రాణాలతో బయట పడ్డాడు. అలా భర్త చూస్తుండగానే భార్య మృతి చెందడం వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. మానవ తప్పిదం వల్లనే ఈ ఘటన జరిగిందని, పైలెట్ భద్రతాపరమైన అంశాలను సరిగ్గా పరిశీలించకుండా పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానిక అధికారులు తేల్చారు. పైలెట్‌ని అరెస్ట్ చేసి పోలీసులు విచారణకు తరలించారు. పారాగ్లైడింగ్ చేస్తున్నామని వీడియో కాల్లో మాట్లాడిన కాసేపటికే ఈ వార్త తమకు అందిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.