Real Estate : లోన్ ఇప్పిస్తామని చెప్పి ఏకంగా ఐదెకరాలు కొట్టేశారు!
హైదరాబాద్‌లో ఓ రియల్ ఎస్టేట్ మోసం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పొలం తాకట్టుపెట్టి డబ్బు తీసుకోవాలనుకున్న వారి పొలాన్ని డబ్బులు ఇవ్వకుండానే కొట్టేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
Real Estate Scam: హైదరాబాద్‌లో అప్పుడప్పుడూ రియల్ ఎస్టేట్ మోసాల గురించి మనం వింటూనే ఉంటాం. తాజాగా ఇలాంటి మోసమే ఒకటి వెలుగు చూసింది. అయితే ఇక్కడ మోసపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారులే కావడం గమనార్హం. లోన్ ఇప్పిస్తామని నమ్మబలికి ఐదెకరాలను(Five Acres) తమ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారు కొందరు ఘనులు. ఎంతకీ లోన్ ఇవ్వకపోవడంతో సదరు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంగారెడ్డి జిల్లా, ఆరూట్లకు చెందిన రంజిత్ రెడ్డి, రంగారెడ్డి అన్నదమ్ములు. వీరిద్దరూ కలిసి రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారం చేస్తుంటారు. అందుకు వారికి కొంత మొత్తం అవసరం అయ్యింది. దీంతో వారు తమ ఆరెకరాల పొలాన్ని తాకట్టు పెట్టి రూ.6 కోట్లు రుణం(Loan) తీసుకోవాలని అనుకున్నారు. తమ వ్యాపార భాగస్వామి అయిన ప్రభాకర రెడ్డితో ఈ విషయమై చర్చించారు.
ప్రభాకరరెడ్డి ద్వారా వారికి మధ్యవర్తులైన ఎర్ర విగ్నేష్ గౌడ, విశ్వనాథంలు పరిచయం అయ్యారు. వారితో కలిసి రుణం విషయం మాట్లాడారు. విగ్నేష్, విశ్వనాథంలు ఐదు శాతం కమిషన్ ఇస్తే ఆరుకోట్లు రుణం ఇప్పిస్తామని చెప్పారు. బంజారాహిల్స్‌కు చెందిన ఫైనాన్షియర్ కేవీ ప్రసాద్‌ను కలిపించారు. ముందుగా ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే పని మొదలుపెడతామని చెప్పారు. ఎంఓయూ రాసుకుని ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని చెప్పారు. 45 రోజుల్లో రుణం మొత్తం ఇస్తామంటూ నమ్మించారు. దీంతో తమ ఐదెకరాల పొలాన్ని(Five Acres) కేవీ ప్రసాద్ గుప్తా పేరిట వారు రిజిస్ట్రేషన్ చేశారు. 2022 ఈ రిజిస్ట్రేషన్ జరిగింది. ఆరు లక్షల ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించారు. 45 రోజుల తర్వాత డబ్బులిస్తామన్న వారు ఇప్పటి వరకు ఆ డబ్బును ఇవ్వలేదు. ఆ తర్వాత దాన్ని మరొకరి పేరు మీద రిజిస్టర్ చేశారు. దీంతో ఈ విషయం తెలిసిన రంజిత్‌రెడ్డి సోదరులు సీసీఎస్ఓ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.