Road Accident in America : మృత్యువు వెంటాడటం అనే మాటను మనం వింటూ ఉంటాం. తెలంగాణకు చెందిన ఓ టెకీ( TECHI) విషయంలో ఇదే జరిగింది. ఓ ప్రమాదం బారి నుంచి బయటపడిన క్షణాల్లోనే మరో ప్రమాదం(ACCIDENT) జరిగింది. దీంతో అతడి ప్రాణాలు అక్కడికక్కడే భార్య చూస్తుండగానే గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
అబ్బరాజు పృథ్వీ రాజ్(30) అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. గత బుధవారం తన భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. వర్షం పడుతున్న కారణంగా వీరి కారు అదుపు తప్పి మరో కారును ఢీకొట్టింది. వీరి కారు పల్టీలు కొట్టింది. కారులోని ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో భార్య భర్తలు ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో సాయం కోసం ఫోన్ చేసేందుకు పృథ్వీ కారు దిగారు. ఆయన భార్య కారులోనే ఉన్నారు. పృథ్వీ ఫోన్ మాట్లాడేందుకు బయటకు రాగానే ఆయనను మరో కారు ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
పృథ్వీ రాజ్ గత ఎనిమిదేళ్లుగా అమెరికాలో(AMERICA) ఉద్యోగం చేస్తున్నారు. గత ఏడాదే శ్రీ ప్రియ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. దీంతో ఆయన మరణ వార్త ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచివేసింది. మృత దేహానికి పోస్ట్ మార్టం చేసిన అనంతరం ఆదివారం హైదరాబాద్కు తీసుకు వస్తారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.