Tenth Exams : పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసే సమయం ఆసన్నమైంది. పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యార్థులు అధికారులు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. విద్యార్థులు ఈ నిబంధనలు పాటించకుంటే డిబార్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకు మించి పరీక్షా కేంద్రాలకు వచ్చిన వారిని అనుమతించేలా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి పరీక్షలు రేపటి (మార్చి 18) నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల టెన్షన్ తగ్గుతుందని భావిస్తున్నారు.
టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన గ్రేస్టైమ్ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు, సైన్స్ సబ్జెక్టులు మినహా మిగిలిన వాటికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టిఎస్ఆర్టిసి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాలు కల్పించింది. కావున విద్యార్థులు వారి హాల్ టికెట్ చూపించి బస్సులో ప్రయాణం చేసి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకొని పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి మీ తల్లితండ్రుల ఆశలు నెరవేర్చాలని విద్యార్థులను కోరారు.