అతడి ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో కొన్నాళ్లకు ఈ కేసు సీఐడీ విభాగానికి బదిలీ అయ్యింది. పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ క్షీర్ సాగర్ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. అతడిపై పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
అబద్ధం ఎన్నటికైనా తెలిసిపోతుంది.. అలాగే తప్పు చేస్తే ఆ తప్పు (Fraud) ఎప్పుడైనా బయటపడుతుంది. ఆ తప్పునకు శిక్ష అనుభవించక తప్పదు. అలాంటిదే ఓ పెద్దాయన విషయంలో జరిగింది. మోసానికి పాల్పడిన వ్యక్తి 18 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. అప్పుడు చేసిన మోసానికి ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని తెలంగాణ సీఐడీ (Telangana Crime Investigation Department) పోలీసులు ఆట కట్టించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar District) కొత్తూరు (Kothur) మండలం నందిగామలో 1995లో వాణి మెటాస్పిన్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభమైంది. ఆ కంపెనీ ప్రతినిధులు షేర్లు ఇస్తామని స్థానికుల నుంచి మొత్తం రూ.4.3 కోట్లు వసూలు చేశారు. ఇలా సేకరించిన నగదు మొత్తంలో రూ.4 కోట్లు 1995లో ముంబైలోని (Mumbai) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ లో (State Bank of Indore) దాదర్ (Dadar) బ్రాంచ్ లో డిపాజిట్ చేశారు. అయితే ఆ బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్న వీఎస్ క్షీర్ సాగర్ (78) ఆ డిపాజిట్లను కాజేశాడు. రూ.3.71 కోట్లను మేనేజర్ కాజేయడంతో కంపెనీ మూతపడింది. దీనిపై 2005లో కొత్తూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పటి నుంచి క్షీర్ సాగర్ తప్పించుకు తిరుగుతున్నాడు. అతడి ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో కొన్నాళ్లకు ఈ కేసు సీఐడీ విభాగానికి బదిలీ అయ్యింది. పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ క్షీర్ సాగర్ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. అతడిపై పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 18 ఏళ్ల అనంతరం ఇండోర్ లో క్షీర్ సాగర్ ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో చొరవ చూపిన సిబ్బందిని సీఐడీ అదనపు డీఐజీ మహేశ్ భగవత్ అభినందించారు.