Police arrest cock: స్టేషన్ లాకప్ లో కోడిపుంజు.. చేసిన నేరమేంటో తెలుసా?
నేరం చేసిన వారిని పోలీసులు వెతికి మరీ పట్టుకుంటారు. ఆ తర్వాత వారిని తీసుకువెళ్లి జైల్లో పడతారు. ఇది చాలా కామన్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఇదే. అయితే, ఓ కోడిపుంజుని పోలీసులు అరెస్టు చేసి లాకప్ లో పెట్టడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? నమ్మసక్యంగా లేక పోయినా ఇది నిజం. ఈ వింత ఎక్కడెక్కడో కాదు, మన తెలంగాణలోనే జరిగింది. ఇంతకీ ఆ పుంజు చేసిన నేరం ఏంటి? దానిని ఎందుకు అరెస్టు చేశారో తెలుసుకుందాం.
మహాబూబ్ నగర్(Mahabubnagar) జిల్లా జడ్చర్ల మండలంలోని బురెడ్డి పల్లి పరిసర ప్రాంతాల్లో తరచూగా నాటు కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులు సైతం ఈ నాటు కోళ్ల దొంగలను పట్టుకునేందుకు నిఘ పెట్టారు. ఇదే క్రమంలో కరివేన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోళ్ల దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ వ్యక్తితో పాటు కోడి పుంజును రెండు రోజుల క్రితం పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కోడి పుంజు కోసం ఎవరూ రాలేదు. దానిని బయట వదిలేస్తే కుక్కలు తినే ప్రమాదం ఉందని పుంజును లాకప్ లో కట్టేసి.. ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. ఇక ఆ కోడి పుంజు తాను చేయని తప్పుకు రెండు రోజులుగా లాకప్ లోనే ఉండి పోయింది.
రెండు రోజులుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లోని లాకప్ లో కోడి పుంజుకు గింజలు వేస్తున్నారు. అది అక్కడే ఉంది. దానిని వారు కావాలని లాకప్ పెట్టలేదు. కానీ దొంగతో అది ఉండటం వల్లే దానిని లాకప్ లో పెట్టడం విశేషం. అది గింజలు తింటూ కొక్కరకో అంటూ కూతలు పెడుతుంది. ఇక వివిధ కేసులపై పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలు లాకప్ లో ఉన్న కోడిపుంజును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.