తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగింస్తారు. రెండేళ్ల తర్వాత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ ఉంటుంది. గతేడాది బడ్జెట్ సమావేశాల్లో సాంకేతిక కారణాల వల్ల గవర్నర్ ప్రసంగించలేదు. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం వద్దని ప్రభుత్వం భావించింది. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవునున్నాయి.
ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగం చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తూ 4వ తేదీన అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చిస్తారు. 6వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మండలిలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. 7వ తేదీన బడ్జెట్ అధ్యయనం చేయడానికి సెలవు ఇస్తారు. 8వ తేదీ నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ నిర్వహించి అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం లభించనుండటంతో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తారు.
ఈ సెషన్లో కాగ్ రిపోర్టును ప్రవేశపెడతారు. మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేపు అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ 5వ తేదీ (ఆదివారం) ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. 2023-24కు సంబంధించి బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఆ మరునాడు సభలో బడ్జెట్‌ను మంత్రులు ప్రవేశపెడతారు. సమావేశం ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో వెళతారు. నాందేడ్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భారీ సభ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఏర్పాటయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం బయట నిర్వహిస్తున్న తొలి సభ ఇదే.