ముందస్తు ఎన్నికలకు వెళదాం అంటూ మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాళ్లు విసరుకున్నారు. నిజామాబాద్ పర్యటనలో నిన్న మంత్రి కేటీఆర్ కామెంట్ చేయగా, ఈ రోజు బండి సంజయ్ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని బండి తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ తన తండ్రితో చెప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీలో కోవర్డులు ఉండరు అని స్పష్టంచేశారు. అభివృద్ది-ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
తెలంగాణలో తమ పార్టీ క్రమంగా బలపడుతోందని బండి సంజయ్ అన్నారు. దక్షిణాది రాష్ట్రంలో తమ పార్టీ ప్రభావం చూపుతుందన్నారు. కర్ణాటకలో అధికారం చేపట్టినట్టుగా.. తెలంగాణలో కూడా తప్పకుండా పవర్లోకి వస్తామని అంటున్నారు. కేసీఆర్ కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలకు వారు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేయాలని.. ఒకేసారి ముందస్తుకు వెళదామని సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ముందస్తు ఎన్నికలకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. పార్లమెంట్‌ను రద్దు చేసి బీజేపీ ముందస్తు వస్తే..అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమని కుండబద్ధలు కొట్టారు. ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వార్నింగ్ ఇచ్చారు. తొమ్మిదేళ్ల పాలనలో మోదీ సర్కార్ తెలంగాణకు ఒక్క విద్యాసంస్థ ఇవ్వలేదన్నారు. మోడీ మాటలు సబ్ కా సాత్ సబ్ కా వికాస్..అంతా సబ్ బక్వాజాలా సాగుతుందని విమర్శించారు.