బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై ఇటీవల టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఈ దాడి జరిగినట్లు… పోలీసుల దర్యాప్తులో తేలింది.
కవితపై పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల, ఆ ప్రెస్మీట్లను సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్లే దాడి జరిగినట్లు పోలీసులు తేల్చారు.
అరవింద్ ఇంటిపై దాడి చేసిన తొమ్మిది మందిలో ఇద్దరు పీహెచ్డీ స్టూడెంట్స్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అరవింద్‌పై దాడి కేసులో నిందితులుగా ఉన్న జాగృతి నవీనాచారి, జాగృతి కన్వీనర్ రాజీవ్ సాగర్లు కనిపించకుండా పోయారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు. అరవింద్ ఇంటి వద్ద ఎక్కువ సంఖ్యలో బందోబస్తు లేకపోవడంతో నిందితులు దాడికి తెగబడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో 2 సిమెంట్ రాళ్ళు, 2 కర్రలు , TRS జెండాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న పూజ సామగ్రి, హాల్ ధ్వంసం చేయడంతో పాటు కారుపై కూడా దాడి చేశారని పోలీసులు గుర్తించారు. నిందితులకు పోలీసుల 41 CRPC నోటీసు ఇవ్వకుండ అరెస్ట్ చేయడంతో కోర్టు వీళ్లకు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది.