PM Modi: అధినేతల ప్రచార హోరుతో తెలంగాణ రాష్ట్రం హీటెక్కింది. సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోడీ (PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర అగ్ర నేతలు తెలంగాణ గల్లీ గల్లీలో ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరుతున్నారు.
తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ (PM Modi) దర్శించుకున్నారు. అక్కడినుంచి నేరుగా మహబూబాబాద్ వచ్చి బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. కేసీఆర్కు అంధ విశ్వాసాలు ఎక్కువ అని ఆరోపించారు. అందుకోసమే యజ్ఞ, యాగాదులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అలాంటి నమ్మకంతో సచివాలయం కూడా కూల్చివేశారని తెలిపారు. అలాంటి సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఒకసారి ఆలోచించాలని కోరారు. అతని నమ్మకాలతో రూ.కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతి పరులను జైలుకు పంపిస్తామని చెప్పారు.