Minister Harish Rao: రాహుల్ గాంధీ జాడ లేదు, ప్రియాంక గాంధీ పత్తా లేదు.. ఓట్లు వేసిన తర్వాత ఢిల్లీ వెళ్లారు. జహీరాబాద్లో మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యాసంగి పంటకు రైతు బంధు వద్దని ఈసీకి దరఖాస్తు ఇచ్చారని ఆరోపించారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారని.. బిచ్చమేసినట్టు కేసీఆర్ రైతుబంధు ఇస్తున్నాడని రేవంత్ రెడ్డి అంటారని మండిపడ్డారు. రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా అని హరీశ్ రావు అడిగారు. రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలవి జూటా మాటలని ఖండించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని కుట్రలు చేసిన మొన్న ఎన్నికల కమిషన్ రైతు బంధుకు అనుమతి ఇచ్చిందని హరీశ్ రావు పేర్కొన్నారు. దానికి సంబంధించి సభలో ఈసీ క్లియరెన్స్ ఇచ్చింది, పైసలు పడతాయని చెప్పానని తెలిపారు. తన మాటలను వక్రీకరించి, ఈసీకి దరఖాస్తు ఇచ్చారని చెప్పారు. దీంతో మళ్లీ ఆపమని ఈసీ చెబుతోందని.. నోటికాడ బుక్కను కాంగ్రెస్ పార్టీ నేతలు ఎత్తగొడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ కి రైతు బంధు ఇయ్య శాతకాదు కేసీఆర్ ఇస్తుంటే అడ్డుకుంటుర్రు
ఇవ్వరు.. ఇచ్చేవారిని ఆపుతారా అని హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. ఆపితే డిసెంబర్ 3వ తేదీ వరకు ఆపుతారు.. తర్వాత మళ్లీ ఉండదే.. మా కేసీఆర్.. తర్వాత అకౌంట్లలో రైతుబంధు డబ్బులు పడతాయని చెప్పారు. మీకు రైతులు గుణపాఠం చెబుతారని వెల్లడించారు. రైతులతో తమది ఓటు బంధం కాదని.. పేగు బంధం అన్నారు. రైతుబంధును ఓట్ల కోసం చెప్పలే.. మేనిఫెస్టోలో పెట్టలేనని స్పష్టంచేశారు. తెలంగాణ రైతులతో కేసీఆర్కు పేగు బంధం ఉందన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో రైతులకు ఎగపెట్టిందని గుర్తుచేశారు. ఇక్కడ కూడా పంటకు ఇవ్వకుండా ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని చెబుతున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటుతోనే పోటు పొడవాలని పిలుపునిచ్చారు.