KMR: డోంగ్లీలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం ఎంతో అండగా నిలుస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో శనివారం ఫ్రూట్స్ డే నిర్వహించారు. విద్యార్థులు 102 రకాల పండ్లను ప్రదర్శించారు. మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్, వైస్ ఛైర్మన్ సోమ రజిని రాజశేఖర్ మాట్లాడారు. పకృతి మనకు ప్రసాదించిన అపురూప వరం పండ్లు అని, నిత్యం పండ్లు తీసుకోవడం వలన జబ్బులు దారి చేరవని అన్నారు.
NZB: రాష్ట్రంలోని అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను ఎకరానికి రూ.15 వేల చొప్పున వెంటనే జమ చేయాలని కోరారు.
నల్గొండ: సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి కానున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో పిస్తా హౌస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని హైదరాబాదు రోడ్డులో పిస్తా హౌస్‌ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
JN: చిల్పూరు మండలంలోని కృష్ణాజిగూడెం గ్రామంలో అంతర్జాతీయ ‘రెడ్ బుక్’ డే సందర్భంగా CPM నేతలు “కమ్యూనిస్టు ప్రణాళిక” అనే పుస్తకాలను చదివారు. ప్రతి ఒక్కరు కమ్యూనిస్టు ప్రణాళిక అనే పుస్తకాన్ని చదవాలని, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు నిత్యం కృషి చేస్తారని మండల కార్యదర్శి సాదం రమేష్ అన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్డీవో హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, బంజారా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని ఆర్డీవో పిలుపునిచ్చారు.
MLG: మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి 3వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు చేసిన సేవలు మరువలేని సీతక్క అన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
WGL: సంగెం మండలం కొత్తగూడెంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల కళ్లలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.
RR: కేశంపేట మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామ సమీపంలో ఉన్న పెద్ద చెరువును సర్పంచ్ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. MLA వీర్లపల్లి శంకర్‌కు రైతులు చెరువుసమస్యలను విన్నవించడంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. MLA ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖఅధికారులు చెరువును ప్రత్యక్షంగా పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన నివేదికలు సేకరించారు.
JGL: రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై యంత్రాంగం దృష్టి సారించింది. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో ఉన్న పుష్కర ఘాట్లను డీపీవో రేవంత్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో గణేష్, ఎస్సై నవీన్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్పంచ్ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి మనోజ్, ఆర్పీలు పాల్గొన్నారు.
SRD: జిల్లా మహిళాల, శిశు, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేయనున్నారు. కలెక్టర్ కార్యాలయానికి ఇటీవల 50 స్కూటీలను తీసుకువచ్చారు. ఇప్పటికే స్కూటీల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులను గుర్తించారు. త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేస్తామని జిల్లా సంక్షేమ అధికారిని లలిత కుమారి తెలిపారు.
SRD: సంగారెడ్డి పట్టణ ప్రజలు తమ ఇళ్ల వద్ద తడి, పొడి, హానికర చెత్తను వేరువేరుగా వేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఇలా చెత్తను వేరు చేయడం వల్ల ప్రాసెసింగ్ సులభమవుతుందన్నారు. ప్రజలు మార్కెట్‌కు వెళ్లే సమయంలో ప్లాస్టిక్ కవర్లను విడిచి, పర్యావరణ హితమైన సంచులను వాడాలని సూచించారు.
SDPT: పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు స్థానిక కంటెంట్ క్రియేటర్లు రూపొందించిన వీడియోలకు మంచి స్పందన లభించింది. సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియమాలపై చిన్న వీడియోలు @Siddipet_Police_Commis sionerateను ట్యాగ్ చేయాలని రష్మీ పెరుమాళ తెలిపారు.
NLG: మాతృభాష పరిరక్షణ మనందరి బాధ్యత అని గ్రంథాలయ ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ పిలుపునిచ్చారు. కేతేపల్లి మండలం, భీమవరం జి.ప.ఉ.పాఠశాలలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషా ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పాలన్నారు. అభివృద్ధికి మాతృభాషనే పునాది అని, ఇందులో పట్టుంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని పేర్కొన్నారు.