JGL: మేడిపల్లి గ్రామ శివారులో 200 గ్రాముల గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కథలాపూర్ మండలం తాండ్రియాలకు చెందిన బద్దం నాగరాజు వద్ద నుంచి గంజాయి పట్టుకున్నట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. నాగరాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గంజాయి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
ADB: భోరజ్ మండలం పెండల్వాడలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. గ్రామాలలో మేకలు, గొర్రెలపై దాడులు పరిపాటిగా మారాయి. మంగళవారం గ్రామంలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు టాప్రే చరణ్, టాప్రీ కార్తీక్‌పై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గ్రామస్థులు వెంటనే చికిత్స నిమిత్తం వారిని హాస్పిటల్‌కు తరలించారు. కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
NZB: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. HYD నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని బీసీ బారుల వసతి గృహాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు బోధించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.
KMR: KMR DCC అధ్యక్ష పదవి నియామకంపై జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 13న AICC అబ్జర్వర్ రాజ్ పాల్ కరోలా జిల్లాకు వచ్చి నేతల అభిప్రాయాలను సేకరించారు. ఈ రేసులో ప్రస్తుత DCC అధ్యక్షుడు శ్రీనివాస్, మల్లికార్జున్, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, గీరెడ్డి మహేందర్ రెడ్డి, రాజు పేర్లు వినిపిస్తున్నాయి.
SRD: పటాన్‌చెరు అమీన్‌పూర్ పరిధిలోని ప్రాంతాల డబుల్ బెడ్ రూమ్ వాసులకు బస్సు సౌకర్యం కల్పించాలని సీపీఎం నాయకుడు నాయిని నరసింహారెడ్డి కోరారు.1500 కుటుంబాల సౌకర్యార్థం ఉద్యోగ, ఉపాధి, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే వారి సౌకర్యం కొరకు ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయాలని మియాపూర్ బస్సు డిపో మేనేజర్ వెంకటేష్‌ను కలిసి సీపీఎం నాయకులు వినతి పత్రం అందజేశారు.
MNCL: బెల్లంపల్లి-రేచిని రైల్వే స్టేషన్ల మధ్య కట్టెల కోసం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధుడు మరణించాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సంపత్ వివరాలు ప్రకారం.. రాంనగర్‌కు చెందిన వెంకటస్వామి(68) కట్టెల కోసం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
SRPT: మాదకద్రవ్యాలు, ఆన్లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండాలని, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడలతో శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండాలని హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు యువతకు సూచించారు. మంగళవారం HNRలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ఎస్టీఎఫ్ అండర్ 14, 17 బాల బాలికల కబడ్డీ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి, క్రీడలను క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు.
SRPT: కోదాడ పట్టణంలో యాచకులు ఎంతమంది ఉన్నారని సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్డీవో సూర్యనారాయణ, కోదాడ పురపాలక సంఘ కమిషనర్ ఆదేశానుసారం మున్సిపాలిటీ సిబ్బంది సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం పునరావాస కేంద్రాలకు యాచకులును తరలించినట్లు తెలిపారు.
ADB: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ బుధవారం ఉట్నూర్‌లో పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేస్తారు. ఉ.11.30 గం.లకు మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్‌లో డివిజనల్ లెవెల్ ట్రైబల్ స్పోర్ట్స్ మీట్, ఆర్చేరి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
SRPT: పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగిన ఘటన హుజూర్ నగర్ పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణంలోని ఓ దుకాణం వద్ద పార్కింగ్ చేసిన, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి మంటలను ఆర్పారు.
MNCL: భీమిని మండలంలో పెద్దపులి సంచరిస్తోంది. మండలంలోని తంగళ్ళపల్లి, బాబాపూరు పత్తి చేలల్లో పులి అడుగుజాడలను రైతులు గమనించారు. రాజారం, బండిపల్లె తెనుగుపల్లె, పెద్దపేట, భీమిని గ్రామాలకు చెందిన రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో సంచరించిన పులి భీమిని వైపు వచ్చినట్లుగా గుర్తించారు.
NZB: పోలీస్ కమీషనర్ సాయిచైతన్యను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూడాలని, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
HNK: నడికుడ మండల కేంద్రంలోని రాయపర్తి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖకు పరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
SRPT: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుంది. మంగళవారం రాత్రి వరకు ప్రాజెక్టుకు 8,598 క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్టు అధికారులు 4 గేట్లను ఎత్తి 8,579 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 644 అడుగుల వద్ద నీటిమట్టం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.