SRD: నారాయణఖేడ్ పట్టణంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ( బాలికలు ) హాస్టల్‌ను సబ్ కలెక్టర్ ఉమా హారతి మంగళవారం రాత్రి సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలికలు రాత్రి భోజనం చేస్తున్నారు. మెనూ ప్రకారంగా వండిన వంటకాల రుచిపై ఆమె ఆరా తీశారు. ఈ మేరకు విద్యార్థినిల సమస్యలు, మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ బాలమణి ఉన్నారు.
MDK: రామాయంపేట మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్ లారీలను మంగళవారం రాత్రి ఎస్ఐ బాలరాజు సీట్ చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా మెదక్ ప్రాంతం నుండి ఇసుక తరలిస్తున్న టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా ఎవరైనా ఇసుక తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ADB: రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 25 వరకు జరిగే విజన్-2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో రామగిరి, జూలపల్లి, ధర్మారం మండలాలలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. వచ్చే 5 నుంచి 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు.
MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధి సదాశివ నగర్ తండాలో మున్యా (36) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై బాలరాజు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
NLG: విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కే. అనిత అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంగళవారం దేవరకొండలోని ముదిగొండ ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఆమె మాట్లాడారు. విద్య ద్వారా మహిళలు ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. సరైన మౌలిక వసతులు, రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.
WNP: వైన్ షాపు టెండర్ల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ వనపర్తి జిల్లాలో ఆశించిన స్పందన రావడం లేదు. జిల్లాలో మొత్తం 36 మద్యం దుకాణాలు ఉండగా, దరఖాస్తు గడువు ఈనెల 18తో ముగియనున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 47 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దరఖాస్తు ఫీజు భారీగా పెంచడమే వ్యాపారులు ముందుకు రాకపోవడానికి కారణమని పలువురు చెబుతున్నారు.
MBNR: హన్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కమ్ సెక్రెటరీ డి.ఇందిర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె బాలికల చట్టాలు, హక్కులు, భద్రత గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈవో తదితరులు పాల్గొన్నారు.
KNR: తిమ్మాపూర్‌లోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, సర్వీసింగ్‌పై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 18–45 ఏళ్ల గ్రామీణ యువకులు అర్హులు. ఆసక్తిగలవారు అక్టోబర్ 22లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 98494110022లో సంప్రదించాలని సూచించారు.
SRPT: అనుమానితులపై పటిష్ట నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నామని సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై అజయ్‌లు అన్నారు. ఎస్పీ నరసింహ ఆదేశానుసారం మంగళవారం సాయంత్రం మండల పరిధిలోని వల్లాపురం వద్ద పోలీసు నాకా బందీ కార్యక్రమం నిర్వహించారు. పకడ్బందీగా వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని ఒక ఆటో, ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు.
MNCL: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని DY.CM భట్టి విక్రమార్క సూచించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించగా మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమంపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిచాలన్నారు.
BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి KTK OC-2 & OC-3 ప్రాజెక్టులను మంగళవారం సాయంత్రం డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు సందర్శించారు. సింగరేణి కాలరీస్‌లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కార్మికులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతతో కూడిన ఉత్పత్తి సంస్థ అభివృద్ధికి మూలస్తంభమని, సమష్టి కృషితో సింగరేణి మరింత పురోగమిస్తుందని తెలిపారు.
HYD: ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డికి ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు లభించింది. ద ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ (ఐఏఏ) నిర్వహించిన 47వ ఆల్ ఇండియా అకౌంటింగ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ జనార్దన్ రాయ్ నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్ (డీమ్డ్ యూనివర్సిటీ)లో ఈనెల 12, 13 తేదీల్లో ఈ సదస్సు జరిగింది.
SDPT: జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన మావోయిస్టు కొంకకటి వెంకటయ్య అలియాస్ వికాస్ కొన్ని రోజుల క్రితం DGP శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ఆయన మంగళవారం స్వగ్రామమైన కూటిగల్‌కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులను కలిశారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
BHNG: తమ భూముల్లో నుంచి కాల్వ తవ్వి ఉపాధిని దెబ్బతీయవద్దంటూ మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. అడ్డగూడూరు మండలంలోని ధర్మారం చెరువు వరకు చేపట్టనున్న బునాదిగాని కాల్వ తవ్వకం పనులు చేపట్టేందుకు భూసేకరణకు వచ్చిన అధికారులను పాటిమట్ల రైతులు మంగళవారం అడ్డుకున్నారు.