SRCL: వేములవాడ పట్టణంలోని తిప్పాపురం శివారు ప్రాంతంలో మంగళవారం వాగులో నుంచి తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను రైతులు అడ్డుకున్నారు. తిప్పాపురం వాగులో నుంచి వందలాది ట్రాక్టర్ల ఇసుక తరలిస్తూ చాలా ఇబ్బంది కలిగిస్తున్నారని రైతులు వాపోయారు. వందలాది ట్రాక్టర్ల ఇసుక తరలించడం ఈ ప్రాంతా రైతులకు ఎంతో నష్టాన్ని కలిగిస్తుందని వాపోయారు.
HYDలో కో-లివింగ్ హాస్టల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన హ్యూమన్ ట్రాఫికింగ్ బృందాలు ఏకంగా 108 కో-లివింగ్ హాస్టల్స్‌పై తనిఖీలు చేపట్టినట్లు తెలిపింది. ఇందులో రాత్రి సమయాల్లో అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు ట్రాన్స్ జెండర్లు, ఇద్దరు సెక్స్ వర్కర్లను పట్టుకుని కేసులు నమోదు చేశారు.
మంచిర్యాల జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలని,ప్రభావిత గ్రామాలలో అవార్డుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. RDOతో కలిసి NH విస్తరణలో ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులను పరిశీలించారు. NH విస్తరణలో భాగంగా ప్రభావిత గ్రామాలలో అవార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
KMM: కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 2026-27 విద్యాసంవత్సరానికి ప్లస్ వన్(11వ తరగతి)లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసులు తెలిపారు. పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
PDPL: గోదావరిఖని పట్టణ చౌరస్తాలో రూ.27 కోట్ల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి, నాణ్యత, వేగం, పారదర్శకతపై దృష్టి సారించారు. ప్రజలకు ఆధునిక వాణిజ్య సదుపాయాలు, అవసరాలకు తగిన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ADB: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేశ్ ఢిల్లీలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నారా చంద్రబాబు నాయుడితో కలిసి పనిచేసిన రాజకీయ అనుభవాన్ని గుర్తు చేసినట్లు నగేష్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రస్తుత రాజకీయాలు తదితరాంశాలపై చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు నగేశ్ పేర్కొన్నారు.
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయనున్నారు. షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయబోతున్నారు. ఆమె వెంట కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లనున్నారు. సాదాసీదాగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో బుధవారం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, నవమి తిథి పురస్కరించుకొని పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ధూప దీప మంగళ హారతి నైవేద్యం నివేదన చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ట ధర నిన్నటి లాగానే నిలకడగానే ఉంది. మంగళవారం యార్డుకు 951 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్టంగా క్వింటాకు రూ.6,400, కనిష్టంగా రూ.5,000 ధర పలికింది. గోనెసంచుల్లో 38 క్వింటాళ్లు తీసుకొని రాగా గరిష్టంగా రూ. 6,000 ధర లభించింది. మార్కెట్ కార్యకలాపాలను మార్కెట్ చైర్ పర్సన్ పాల్గొన్నారు
WNP: దీపావళి సందర్భంగా టపాసుల విక్రయదారులు తప్పనిసరిగా చట్టపరమైన నియమాలను పాటించాలని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి సూచించారు. రద్దీ ప్రదేశాలు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, పెట్రోల్ బంకుల సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేయరాదన్నారు. ప్రజలు భద్రతా నియమాలు పాటిస్తూ, పిల్లలను పెద్దల పర్యవేక్షణలో టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ADB: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు తాజా నీటి వివరాలను AEE హరీశ్ కుమార్ బుధవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 277.50 మీటర్లుగా ఉందన్నారు. మొత్తం నీటి సామర్థ్యం 0.571 టీఎంసీలకు గానూ ప్రాజెక్టులో 0.470 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు.
SRCL: బీడీ కార్మికుల పట్టా భూమిలోకి వచ్చి బీడీ కార్మికులను దూషించి, దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని చందుర్తి మండల కేంద్రం బీడీ కార్మికులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 40 సంవత్సరాల క్రితం సర్వేనెంబర్ 504లో ఎకరం 20 గుంటల భూమి 30 మంది బీడీ కార్మికులు ఇండ్ల స్థలాల కోసం కలిగి ఉన్నామన్నారు.
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం GHMC ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా 1950 హెల్ప్ లైన్, NGRSను ఏర్పాటు చేశారు. 1950 హెల్ప్ లైన్ ద్వారా ప్రజలు ఓటర్ల జాబితా, పోలింగ్ సెంటర్లు, ఎపిక్ కార్డులు తదితర వాటికి సంబంధించిన సమాచారం పొందడమే కాకుండా ఫిర్యాదులు చేయవచ్చు.
NLG: త్రిపురారం మండలం బాబాసాయిపేట నుంచి మిర్యాలగూడ వెళ్లే మార్గంలో భారీ వర్షాలకు బ్రిడ్జి దెబ్బతింది. దీంతో అధికారులు ఈ రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. బ్రిడ్జి త్వరగా మరమ్మత్తు చేయాలని, తమ ఇబ్బందులను తొలగించాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
RR: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న టెండర్ల ప్రక్రియల భాగంగా హయత్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 28 షాపులకు 308 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 86 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, ఈనెల 18తో టెండర్ల దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.