NZB: మాస్టర్ ప్లాన్ జీఓను రద్దు చేయాలని కోరుతూ జిల్లా ప్రజా ప్రతినిధులను కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బాధిత రైతులు ఆదివారం నిర్ణయించుకున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు ఐక్య కార్యచరణ కమిటీ ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇండస్ట్రియల్ జోన్లో భూములు కోల్పోనున్న బాధిత రైతులు ఎనిమిది రోజులపాటు ప్రణాళిక రూపొందించారు.
KMR: జిల్లాలోని గ్రామీణస్థాయిలో ప్రజలకు ఆహార కల్తీపై అవగాహన కల్పిస్తామని వినియోగదారుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి పేర్కొన్నారు. నేడు నగరంలోని సమితి కార్యాలయంలో మాట్లాడారు. జిల్లా కార్యవర్గాన్ని విస్తరించే కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా రామనాథం, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడిగా అనిల్ ఉన్నారు.
NZB: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులు ప్రజాప్రతినిధులతో, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పధకాలపై నిజామాబాద్ కలెక్టర్ కార్యలయంలో సమన్వయ సమావేశము నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.
NZB: భీమ్‌గల్ మండలం బడా భీమ్గగల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బడా భీమగల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీల్, గ్రామ ప్రెసిడెంట్ సురేశ్, మండల జనరల్ సెక్రటరీ విజయ్, తదితరులు ఉన్నారు.
KMR: అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందిన ఘటన రామారెడ్డి మండలం అన్నారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పొక్కిలి జంపాల రవి(48) ఆదివారం మృతి చెందాడు. మృతుడిని కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇది హత్యగా పోలీసులు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా రవికి తన సోదరులతో ఆస్తి తగాదాలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ADB: అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు దశలవారీగా ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా అధికారులతో గూగుల్ మీట్ ద్వారా ఆయన మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అర్హులను గుర్తించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
NRML: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ప్రభుత్వ పథకాలపై ఎటువంటి దుష్ప్రచారం చేయరాదని, పథకాల అమలుపై ప్రజలకు ఎటువంటి సందేహాలున్న ప్రజాపాలన కేంద్రాల వద్ద అధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు.అలాగే, గ్రామీణ స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
HYD: ప్రజలకు ఆమోదయోగ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని ఉప్పల్ నియోజకవర్గ ఇంఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ నియోజకవర్గానికి చెందిన వివిధ బస్తీల వాసులు ఆయనను కలిశారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పరమేశ్వర్ రెడ్డి చెప్పారు.
HYD: ఘట్కేసర్లోని గట్టు మైసమ్మ అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. మైసమ్మ జాతరలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సుభీక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే అమ్మవారి జాతరకు మౌళిక వసతులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో చిత్తారమ్మ తల్లిని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మూలమంత్ర జపము, దేవతహోమాలు, పూర్ణాహుతి పూజలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్తారమ్మ దేవి 50వ స్వర్ణోత్సవాల జాతరలో భక్తులు అధిక సంఖ్యలో రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
మేడ్చల్: మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ను బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఇవాళ కలిశారు. కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో కాలనీలోని అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధికి చర్యలు చేపడతామని అన్నారు.
HYD: కష్టపడిన వారికి కాంగ్రెస్ సముచిత స్థానం కల్పిస్తుందని గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా తనకు వైస్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించే విధంగా కృషి చేస్తానన్నారు.
RR: కార్పొరేట్ వైద్య సంస్థలు ప్రజాసేవకు అంకితం కావాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హెల్త్ క్యాంప్‌ను ఆమె ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ.. కార్పొరేట్ వైద్య సంస్థలు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, ప్రజా సంక్షేమానికి దోహదపడాలని పిలుపునిచ్చారు.
WGL: జిల్లాకు చెందిన గోస్కుల సుధాకర్‌కు డాక్టరేట్ లభించింది. కాకతీయ యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగంలో వీరన్న పర్యవేక్షణలో ‘పర్ఫామెన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ రేసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఏ కేస్ స్టడీ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్’ అనే సిద్ధాంత గ్రంథాన్ని సుధాకర్ రూపొందించారు. ఈ క్రమంలో కేయూ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది.
NRPT: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కొరకు ఆదివారం తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ నారాయణపేట మండలం పేరపళ్ళ గ్రామ పరిధిలోని వీధి తండాలో విచారణ చేపట్టారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిర రైతు కూలీ భరోసా, రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలపై విచారణ చేశారు. అర్హులైన వారికి పథకాలు అందజేస్తామని తహసీల్దార్ అన్నారు.