NRPT: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం త్వరగా అందించేందుకు పోలీసులు, సెక్షన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
NRML: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగారు. నిర్మల్ జిల్లా తానూర్ మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో మాట్లాడుతూ.. ప్రతినెలా వేతనాలు చెల్లించాలని, 2వ పీఆర్సీ అమలు చేయాలని, మల్టీపర్పస్ కార్మిక విధానాన్ని రద్దు చేసి కేటగిరీల వారీగా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. అక్కడే ప్రజావేదిక నిర్వహిస్తున్న డీఆర్డీవోకి వినతిపత్రం అందజేశారు.
WNP: ఇందిరమ్మ ఇండ్ల సర్వే సకాలంలో పూర్తి చేయాలని, అదే సమయంలో నాణ్యతతో కూడినదై ఉండాలని అధికారులను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం అదనపు కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. సర్వే వేగవంతం చేయాలని అన్నారు.
HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఎంఫార్మసీ పరీక్షా తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో ఈ నెల 27న రాష్ట్రప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఆ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను తిరిగి ఈ నెల 31వ తేదీన పెట్టనున్నారు.
NLR: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు ఇటీవల వెల్లడించారు. ఈ పోటీలలో యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా మనిమద్దె పరమేష్ రాజ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహ రెడ్డిని మనిమద్దె పరమేష్ రాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి, బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
SDPT: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో ఇవాళ మల్లికార్జున స్వామి కళ్యాణం జరగనుంది. ఈ ఉత్సవం కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ కళ్యాణోత్సవానికి దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
SRCL: సీఎం కప్ రాష్ట్రస్థాయి ఖోఖో జట్టుకు తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల మోడల్ స్కూల్ విద్యార్థిని జి. శరణ్య ఎంపికయింది. శనివారం శరణ్యను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాధ, పీఈటీ స్వాతి, ఇతర అధ్యాపక బృందం అభినందించింది. ఇటీవల జరిగిన సీఎం కప్ జిల్లాస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి ఖోఖో జట్టుకు శరణ్య ఎంపికైంది.
NGKL: జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కల్వకుర్తి మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థిని ఇర్ఫా మహేక్ శనివారం ఎంపికైంది. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన హ్యాండ్ బాల్ బాలికల జూనియర్స్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో నిర్వహించే హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైంది.
MBNR: ఆత్మకూరు మండలంలోని పిన్నంచర్ల గ్రామ సమీపంలో గాయపడిన జింకను ఆ గ్రామ యువకులు కాపాడారు. శనివారం సాయంత్రం గాయపడ్డ జింకను యువకులు గుర్తించి ఎస్సై నరేందర్‌కు అప్పగించారు. పిన్నంచర్ల గ్రామంలోని ఓ గేటుకు ఉన్న కంచెకు చిక్కుకొని గాయపడిన జింకను యువకులు ఖాజన్న, అంజి, నరేశ్ గౌడ్, వెంకటేష్ ఎస్సైకి తెలిపారు. జింకకు సపర్యలు చేసి అటవీ అధికారులకు అప్పగించారు.
HYD: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమాజిగూడ డివిజన్ బీఎస్ మక్తలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తులను శనివారం స్థానిక కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆమె వెంట సరిత, తదితరులున్నారు.
NRPT: మరికల్ పెట్రోల్ బంకు వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ మరమత్తులు కారణంగా నీటి సరఫరా ఉండదని మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా కార్యనిర్వహక అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం నుండి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 48గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల్లోని 245 గ్రామాలలో నీటి సరఫరా ఉండదని అన్నారు.
KMM: మధిర మండలంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లో జరిగే “వెయ్యి గొంతులు, లక్ష డప్పులు” కార్యక్రమం విజయవంతం చేయాలని అంబేద్కర్ భవన్‌లో ఈనెల 30న ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశం నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షుడు మేకల రాజా మాదిగ శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
KNR: ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ను మరింత విస్తృతం చేయనున్నట్లు కేశవపట్నం ఎస్సై రవి, సైదాపూర్ ఎస్సై తిరుపతి తెలిపారు. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం కేశవపట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్సై రవి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు.
NLG: దామరచర్ల మండలం జైత్రంతండాకు చెందిన రాజేశ్వరం(19) పురిటి నొప్పులతో NLG ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. శనివారం రాత్రి మగ శిశువుకు జన్మనిచ్చిన రాజేశ్వరి మరణించింది. బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
KMM: కల్లూరు మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. బత్తులపల్లి అటవీ ప్రాంతంలో ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా ఒకరు పట్టుబడినట్లు కల్లూరు ఎస్సై హరిత తెలిపారు. మరో 8మంది పరారీలో ఉన్నారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం ఎస్సై తెలిపారు. అనుమతి లేకుండా పేకాట నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.