ADB: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ రాజర్షి షా శనివారం స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు తగినంత గ్యాస్ నిల్వలు ఉండటంతో సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందన్నారు. గ్యాస్ కొరతపై వ్యాపిస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు. అనవసర భయాందోళనలకు లోనై పానిక్ బుకింగ్‌లు చేయడం వల్ల ఇతర వినియోగదారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
MNCL: చెన్నూర్ నియోజకవర్గంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల సమయంలో క్యాతన పల్లిలోని పలు వార్డ్‌లలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. అనంతరం 10 గంటలకు మందమర్రిలో రూ. 2.31 కోట్ల నిధులతో మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
SDPT: నంగునూరు (M) నర్మెటలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తుమ్మల, పొన్నం, వివేక్ శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ హైమావతి, సీపీ రష్మి పెరుమాళ్ కలిసి హెలిప్యాడ్, సభాప్రాంగణం, 150 స్టాళ్లను పరిశీలించారు.
MHBD: కురవి మండలం తిర్మలాపురం గ్రామంలో ఎస్ఐ గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ వాడకం, గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాల నిషేధం, సిసి కెమేరాల ఏర్పాటుపై ఎస్ఐ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక సర్పంచ్ కనకటి అచ్చమ్మవీరన్న, ఉపసర్పంచ్ దేవి శ్రీను, వార్డ్ సభ్యులు అయనను సన్మానించారు.
WGL: చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో 1141 మంది రైతులు సాదా బైనామా ద్వారా దరఖాస్తులు చేసుకుని నెలలు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు ఆరోపించారు. పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రతిరోజూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి భూభారతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
KMM: ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో నూతన 11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని శనివారం సర్పంచ్ తుళ్లూరు నిర్మల కుమారి, ఎఫ్ఎవో కృష్ణ ప్రసాద్ కలిసి పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృషితో మంజూరైన ఈ ఉపకేంద్రాన్ని ఎకో టూరిజం పార్క్ సమీపంలో నిర్మించేందుకు పంచాయతీ తీర్మానం చేసింది. స్థలానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని అధికారులు తెలిపారు.
SRPT: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోపబూయిష్టమైందని, అంకెల గారడి చేశారే తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు ఏ మాత్రం బడ్జెట్ ఆశాజనకంగా లేదన్నారు.
BHNG: హైదరాబాద్‌లోని నార్సింగ్‌కు చెందిన అనిత తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం యాదగిరిగుట్టకు వచ్చింది. ఆమె తన కుటుంబ సభ్యులతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంది. తిరుగు ప్రయాణంలో అనిత కొండపై ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా.. సడెన్‌గా బస్సు కదిలింది. ఈ క్రమంలో అనిత కిందపడటంతో బస్సు ఆమె కాలు మీదుగా వెళ్లింది. ఆమెకు కాలుకు స్వల్పంగా గాయాలయ్యాయి.
MBNR: ఎంపీ డీకే అరుణ శనివారం జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు ప్రారంభించారు. పోచమ్మగుడి ఊరచెరువు అభివృద్ధికి అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.కోటి,11లక్షల నిధులతో చేపట్టబోయే పనులకు ఆమె భూమిపూజ చేశారు. డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
VKB: మోమిన్‌పేట మండల కేంద్రంలో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు అధ్వాన్నంగా తయారవ్వడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి వచ్చే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని వాహనాదారులు కోరుతున్నారు.
MDK: నార్సింగి మండలం షేర్ పల్లి గ్రామానికి చెందిన పంబల శ్యామల వైద్య చికిత్స నిమిత్తం మైనంపల్లి రోహిత్ రావు తన ఉదారతను చాటుకున్నారు. బాధితురాలి కుటుంబానికి మంజూరైన రూ. 2,50,000 ఎల్వోసీ (LOC) పత్రాన్ని ఆయన స్వయంగా అందజేశారు. శ్యామల త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. తమకు అండగా నిలిచిన రోహిత్ రావుకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
MLG: కన్నాయిగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని ముప్పనపల్లి ఫీడర్‌లో మరమ్మతు పనుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. మరమ్మత్తు పనులు పూర్తవ్వగానే విద్యుత్ సరఫరా పునః ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
RR: గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించి, నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ASF: విద్యుత్ ప్రమాదాలను నివారణ, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల భద్రత కోసం లైన్ క్లియర్(LC) యాప్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆసిఫాబాద్ SE ఉత్తమ్ జాడే ప్రకటనలో తెలిపారు. LC యాప్‌తో డిజిటల్ పద్ధతిలో అనుమతులు జారీ అవుతాయని పేర్కొన్నారు. ఫీడర్, పంపిణీ లైన్ వివరాలు స్పష్టంగా ఉంటాయని, తప్పుడు ఫీడర్ ఎంపికకు అవకాశం లేకుండా అప్రమత్తం చేస్తుందన్నారు.
NLG: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా బడ్జెట్‌లో మొత్తం మోసం చేశారని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు..