JN: ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జనగామలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసగాని సుమా, జిల్లా అధ్యక్షుడు మండల సందీప్, మండల కార్యదర్శి మామిడాల రమేష్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. సందీప్ మాట్లాడుతూ.. 1970లో ఎస్ఎఫ్ఐ ఏర్పడిందన్నారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎస్ఐలను బదిలీ చేస్తున్నట్లు నేడు అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయినవారిలో ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పని చేస్తున్న యూ.నర్సింహరావు సీసీఆర్‌బీకి బదిలీ కాగా, ఐటీ కోర్ ఎస్ఐగా పనిచేస్తున్న పీ.రాజ్ కుమార్‌ను మడికొండ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.
SRPT: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సాయి గౌతమి కళాశాల ఆవరణలో జనవరి 8వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే బీసీ విద్యార్థుల సమర శంఖారావం వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు.
NZB: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.
NGKL: అమనగల్లు మండలంలోని బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమనగల్లు ఎస్సై వెంకటేశ్ సోమవారం హెచ్చరించారు. నూతన సంవత్సరం నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడుపవద్దని ప్రజలకు సూచించారు. మండలంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు వాహనాలను నిరంతరం తనిఖీ చేస్తారని, డీజేల వినియోగానికి అనుమతి లేదని ఎస్సై వెల్లడించారు.
SRD: రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్‌లోని సోమవారం స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ పర్యటించారు. చివరి దశలో ఉన్న బాలవిహార్ పార్క్ పనులను కార్పొరేటర్ పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఏఈ ఫైజెన్, డీఈ లక్ష్మి ప్రియా, నగేష్, ఐలాపూర్ ఐలేష్, ఎల్వర్తి మల్లేశం, శాంతమ్మ ఉన్నారు.
SRCL: పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన గుడ్ల కౌసల్య-రాజు దంపతులు సైకిల్‌పై వెళుతుండగా లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైనట్లు స్థానికులు తెలిపారు. కలెక్టరేట్లో ప్రజావాణికి దరఖాస్తు చేసుకోవడానికి దంపతులు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NRML: డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలను మండల ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని లోకేశ్వరం ఎస్సై అశోక్ మండల ప్రజలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం మండల ప్రజలు సహకరించాలని కోరారు.
BDK: అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చండ్రుగొండ ప్రధాన కూడలిలో అఖిలపక్షం నాయకులు నల్ల బ్యాడ్జీలతో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి హోదాలో ఉండి అంబేద్కర్‌ను అవమాన పరిచేలా మాట్లాడడం బాధాకరమన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
NLG: కొండమల్లేపల్లిలోని కొనుగోలు కేంద్రాలను PACS ఛైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంట వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు ఆలస్యం అయిందని అధికారులు నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
KMM: మధిర మండలం సిరిపురం గ్రామం నుంచి మిట్టగూడెం వెళ్లే రహదారిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోమవారం తెలిపారు. ఈ గుంతల వల్ల వాహనదారులు కిందపడిన ఘటనలు గతంలో చాలా ఉన్నాయన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.
ADB: ఆదివాసీల ఆరాధ్య దైవం రాయితాడ్ జంగుబాయి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం హైదరాబాద్ ప్రజా భవన్లో జంగు బాయి దేవస్థానం నిర్వహణ కమిటీ సభ్యులు, ఆదివాసీ సంఘాల నాయకులతో కలసి ఉత్సవాల గోడ పత్రులను ఆవిష్కరించారు. జనవరి 2న కెరమెరి మండలంలోని కోట పరండోలిలో జంగుబాయి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
MBNR: బాలానగర్ మండలం నేరళ్లపల్లి గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాతృమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థుల సంక్షేమానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
NZB: పోతంగల్ మండల కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మించి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ.. నూతన మండలంగా ఏర్పడిన పోతంగల్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
HYD: రహమత్ నగర్ డివిజన్ హబీబ్ ఫాతిమా నగర్‌లో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ అసోసియేషన్-2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు వారిని శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెంట్రింగ్ యూనియన్‌కు అండగా ఉంటానని తెలిపారు.