BDK: భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 24 కేసుల్లో పట్టుబడిన 449 కేజీల గంజాయిని సోమవారం కాల్చి వేసినట్లు ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. గంజాయిని ఖమ్మం పరిధిలోని తాళ్లపేట మండలంలో గంజాయిని దహనం చేశారు. కాల్చివేసిన గంజాయి విలువ రూ.1.12 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
NGKL: జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఐజి రమేష్ నాయుడు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సమక్షంలో కార్యాలయంలోని అన్ని విభాగాలకు సంబంధించిన రిజిస్టర్‌లను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రజలతో పోలీసులు వ్యవహరించాల్సిన పద్ధతులపై ఐజి.. సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
NRML: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వారు దరఖాస్తులను స్వీకరించి, సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
KMM: మధిర మండలం రాయపట్నం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక నిల్వలను సోమవారం ఆర్‌ఐ భాను ప్రసాద్, రెవిన్యూ సిబ్బంది పరిశీలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేస్తే స్వాధీనం చేసుకుంటామని ఆయన తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ADB: తాంసీ మండలంలోని ఘోట్కూరి గ్రామంలో దళిత బస్తీ రైతులకు కరెంట్ మోటార్లు వెంటనే సరఫరా చేయాలని కోరుతూ కలెక్టర్ రాజర్షిషాను CPI జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, కిషోర్, స్వామి, వినోద్, తదితరులు ఉన్నారు.
ADB: బోథ్ మండలంలోని పొచ్చర జలపాతంలో రక్షణ చర్యలు తీసుకుంటున్నామని జలపాతం ఇంఛార్జ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అమర్ సింగ్ అన్నారు. జలపాతంలో ప్రమాదాల నివారణకు రిస్క్ జాకెట్స్ మంజూరయ్యాయని, ఇద్దరు గజ ఈతగాళ్లని కూడా రక్షణ కోసం నియమిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అటవీశాఖ అధికారులు నాగారం, ముంతాజ్ ఉన్నారు.
KMM: వరరామచంద్రపురం మండల నూతన ఎంఈఓగా చిచ్చడి బాబురావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలు లక్ష్యం మేరకు అమలయ్యేలా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తానని ఎంఈఓ తెలిపారు. పాఠశాలలు సక్రమంగా నడిచేలా చూస్తానన్నారు. అందరి సహకారంతో మండలంలో ఉత్తమ ఫలితాల సాధించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
WNP: ప్రజలు సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ జిల్లా ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ జిల్లా పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరుఫున భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు.
KMM: 1969 తెలంగాణ ఉద్యమకారులు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నామని తమకు గుర్తింపు కార్డులు, ఆరోగ్య శ్రీ, ఉచిత బస్సు ప్రయాణం, 250 గజాల స్థలం, 65 ఏళ్లు నిండిన వారికి రూ.10వేల భృతి అందించాలని కోరుతూ మధిర రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని వినతిపత్రంలో వారు పేర్కొన్నారు.
ADB: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజర్షి షా పలు మండలాలకు చెందిన అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
BDK: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ రోహిత్ రాజ్ “యాన్యువల్ ప్రెస్ మీట్” నిర్వహించారు. ఈ సందర్భంగా సంవత్సర కాలంలో పోలీసుల యొక్క పనితీరు, నేరాల కట్టడిపై చేసిన వివరాలను వెల్లడించారు. సైబర్ క్రైమ్స్, గంజాయి కట్టడి వంటి అంశాలలో జిల్లా పోలీసుల పర్ఫామెన్స్ బాగుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
KNR: నెల రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, చదువు చెప్పే సార్లు లేక విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేజీబీవీల్లోనే 2 వేలకు పైగా 10వ తరగతి విద్యార్థులు ఉండగా… వీరికి మార్చిలో వార్షిక పరీక్షలు ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
NRML: నర్సాపూర్ కేజీబీవీ పాఠశాలను జిల్లా విద్యాధికారి రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు సమ్మెలో ఉన్నందున విద్యార్థులు చక్కగా చదువుకోవాలని.. పదవ, ఇంటర్ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.
SDPT: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు హైదరాబాద్ ఈసీఐఎల్ రన్నర్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. ఈ మేరకు సిద్దిపేటలోని పరంధాములు, గాడి చెర్లపల్లిలోని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను వారు పరామర్శించి, ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. భవిష్యత్తులోనూ రెండు కుటుంబాలకు మరింత సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు.
BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం కార్యదర్శి వంశీ కృష్ణ తెలిపారు. ప్రజలు దళారులను నమ్మొద్దని సర్వే విషయంలో ఏ సమస్యలున్నా స్థానిక పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు.