SRD: జిన్నారంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 147 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
వనపర్తి మున్సిపాలిటీ 12వ వార్డు రాజనగరం ఆలయం వద్ద మున్సిపల్ సిబ్బంది ఇంటి పన్నుల వసూలు కార్యక్రమం చేపట్టారు. మంగళవారం 12వ వార్డ్ ఆఫీసర్ పురుషోత్తం, సిబ్బంది రవి ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
KNR: వీణవంక మండలం శ్రీరాములపేటలో నార్ల కమలమ్మ (70) ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న సుమారు 2.5 తులాల బంగారు పుస్తెల తాడును చోరీ చేసి పరారయ్యారు. జమ్మికుంట రూరల్ సీఐ కె. లక్ష్మీనారాయణ, వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.
GDWL: అయిజ మండలం వెంకటాపురం గ్రామం మతసామరస్యానికి అద్భుత ఉదాహరణ అయ్యింది. శ్రీశైలం వెళ్తున్న పాదయాత్ర భక్తులు, గురువులకు స్థానిక ముస్లిం కుటుంబానికి చెందిన పింజరి లేఖన్ తన నివాసంలో ఆశ్రయం కల్పించారు. హిందూ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికించి ఆతిథ్యం ఇచ్చారు. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించారు, గ్రామంలో సానుకూల సమన్వయం ఉదహరించారు.
ASF: క్యాతన్‌పల్లి ఘటనకు సంబంధించి తనపై నమోదైన కేసులో భాగంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో హాజరై రిజిస్టర్‌లో సంతకం చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికల వేళ బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి ప్రయత్నించాయని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కౌన్సిల్ ఎన్నిక నిర్వహించాలన్నారు.
NZB: జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా జరగకూడదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక జారీ చేశారు. ఇసుకను అక్రమంగా తవ్వకం లేదా రవాణా చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లాలో ఇసుక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన ఇసుక వాహనం ఇసుక ఆన్‌లైన్ యాప్ ద్వారానే అనుమతులు తీసుకోవాలన్నారు.
RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల మండలంలోని అంతారం గ్రామంలో సర్పంచ్ రామస్వామి ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంగా చెత్తను తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం ZPHS పాఠశాలలో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు.
NLG: కొండభీమనపల్లిలో గత నెల 21న జరిగిన దొంగతనం కేసులో నిందితుడు మెహబూబ్ పాషాను అరెస్ట్ చేసినట్లు దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. తాళం వేసిన శంకరయ్య ఇంట్లోకి చొరబడి రూ. 90,000 నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను అపహరించినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి కొంత సొమ్మును రికవరీ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
సూర్యాపేట పట్టణంలో సోమవారం రాత్రి పలు లాడ్జిలో ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విజిటర్స్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానితుల వివరాలు ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని లాడ్జి యజమానాలను హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మందమర్రి మార్కెట్ మజీద్‌లో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులు, అధికారులను కలిసి అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.
ADB: ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ అవరమొచ్చినా తాను అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారం కోసమే ప్రతీ వారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజాసేవ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజా దర్భార్‌కు ఆయన హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
MDCL: తార్నాకలోని ఐఐసీటీ వద్ద చేనేత వస్త్ర ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కార్మికులు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. దేశ సాంస్కృతిక ప్రతీకలైన వివిధ రకాల చీరలు, ఇంట్లో తయారు చేసిన వస్త్రాలు, వేసవికాలానికి అనుకూలమైన కాటన్ పంచెలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
HYD: గ్రేటర్ HYD సిటీ పరిధిలో రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో రూ. 24,500 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. నగరంలో రహదారుల విస్తరణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టారు.
భద్రాద్రి: భద్రాచలం రామాలయంలో ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. 39 రోజులకు హుండీల ద్వారా 1,05,94,090 ఆదాయం లభించిందని ఆలయ ఈవో దామోదర్ రావు తెలిపారు. నగదుతో పాటు 80 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి వచ్చాయన్నారు. అమెరికా డాలర్లు 91.కెనడా డాలర్లు 5.ఓమన్ రాయల్ 1/2 రాయల్, మలేషియా రింగెట్స్ 20 వియత్నామీస్ డాంగ్ 5000, న్యూజిలాండ్ డాలర్స్ 110 వచ్చాయన్నారు.
KMM: చెక్కు బౌన్స్ కేసులో శ్రీరాంనగర్‌కు చెందిన జి. విద్యా సాగర్‌కు ఖమ్మం కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. 2017లో బానోత్ శరత్ వద్ద తీసుకున్న రూ. 2 లక్షల అప్పు కోసం ఇచ్చిన చెక్కు తిరస్కరణకు గురైంది. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయాధికారి బెక్కమ్ రజని నిందితుడికి జైలు శిక్షతో పాటు బాధితుడికి రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.