KMM: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన ఆయన.. ఈ నెల 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా నేతలు కాసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నారు.
KMR: లింగంపేట మండలంలోని ముంబాజిపేట తండా జగదాంబ సేవలాల్ ఆలయంలో బుధవారం ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 21 అడుగుల ధ్వజస్తంభంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు మహాహోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
KNR: కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక బడిన కులాల సంక్షేమానికి కట్టుబడి ఉందని మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ రవీందర్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో తాటి చెట్టుపై నుంచి కింద పడి అంగవైకల్యం పొందిన గీత కార్మికుడు సంజీవ్ గౌడ్‌కు ఎక్సైజ్ శాఖ నుంచి రూ.5 లక్షల ఎక్సగ్రేషియా అందించినట్లు వారు తెలిపారు.
ADB: నార్నూర్ మండలమంతా ఈ రోజు హోలీ పండుగను రంగుల హర్షధ్వానాలతో ఘనంగా జరుపుకున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. గ్రామ వీధులు గులాబీ, పసుపు, ఆకుపచ్చ రంగులతో కళకళలాడాయి. యువత డీజే పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
NRML: సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రహదారి భద్రత ఛాంపియన్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ భోజన్న మంగళవారం ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు 100 శాతం పాల్గొని తమ పాఠశాలను నమోదు చేయాలని వారు సూచించారు. క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన, చిత్రలేఖనం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించి ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలని, మార్చి 14 చివరి తేదీ అని పేర్కొన్నారు.
MDCL: హోలీ పండుగ సందర్భంగా మేడిపల్లిలో పిల్లలు, పెద్దలు అంతా కలిసి రంగులు చల్లుకుంటూ సందడిగా గడిపారు. కొందరు స్ప్రేలతో రంగులు నింపి స్నేహితులపై చల్లుకుంటూ సంతోషం పొందుతున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సవాలతో చిందులు వేసారు.
SRD: సేవాలాల్ మహారాజ్ ఆలోచన విధానాలతో ప్రతి ఒక్కరూ కూడా భక్తి మార్గంలో నడవాలని దక్షిణ కాశీ సేవాలాల్ ఘడ్ పీఠాధిపతి సంత్ శ్రీ జగదీశ్వర్ నందు మహారాజ్ అన్నారు. మంగళవారం ఖేడ్ మండలం శివార్ సందూర్ తండాలో హోలీ జాతర మహోత్సవంలో 21 మంది కన్నెలతో అభిషేకం, హోమం పూజలు నిర్వహించారు. స్థానిక యంత్ర తంత్ర త్రిశూలాన్ని దర్శించుకోవడంతో పాపాలు తొలిగి పోతాయని పేర్కొన్నారు.
MBNR: రాష్ట్ర వ్యాప్తంగా సంచలమైన సృష్టించిన ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న సంఘటనపై జడ్చర్లకు చెందిన న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పరిసర ప్రాంత గ్రామాలలో మంగళవారం హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ హోలీ వేడుకల్లో చిన్న, పెద్ద అందరు పాల్గొని రంగులు పూసుకుని హోలీ వేడుకలను జరుపుకున్నారు. కొంతమంది చిన్నారులు గోగు పువ్వుతో తయారుచేసిన రంగులు చల్లుకొని హోలీని జరుపుకున్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిశారు. మెదక్ లోక్‌సభ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సదుపాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ కోరారు.
SRPT: ప్రభుత్వం 100 రోజుల ప్రజా పాలనలో భాగంగా రేపు అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ ఫిరోజ్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. అనంతగిరి మండల ప్రజలు ఈ హెల్త్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంప్‌లో కంటి, దంత, షుగర్, బీపీ, జనరల్ మెడిసిన్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
WNP: రాబోయే ఎండాకాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని వనపర్తి మున్సిపల్ ఛైర్మన్ మాధవి తెలిపారు. మంగళవారం జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం తన చాంబర్ నుండి మాట్లాడుతూ.. పైపు లీకేజీలు ఉన్న వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులపై అందరూ కలిసి పనులు చేసుకోవాలని ఆమె సూచించారు.
KMR: బీబీపేట మండల కేంద్రంలో ఈ నెల 8వ తేదీ (ఆదివారం) నుంచి పశువుల సంత ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి వెనుక భాగంలో ఈ సంతను ఏర్పాటు చేశారు. ఇందులో ఎడ్లు, గేదెలు, గొర్రెలు, మేకల కొనుగోలు, విక్రయాలు జరుగుతాయని పంచాయతీ వర్గాలు తెలిపాయి. బీబీపేటతో పాటు పరిసర గ్రామాల రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NLG: మాడ్గులపల్లి మండలం ఆగా మోత్కూర్ గ్రామపంచాయతీ భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని సీపీఎం శాఖ కార్యదర్శి, 7వ వార్డు సభ్యులు బంటు నాగరాజు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణంలో ఇసుకకు బదులు డస్ట్ వాడుతున్నారని, దీనిపై పంచాయతీ ఏఈని అడగగా తమకు సమాచారం లేదని తెలిపారని అన్నారు.
WNP: పెద్దమందడి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు అమ్మపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలన్నారు.