»Only New Vehicles To Have Tg Number Plates In Telangana
Telangana : తెలంగాణ నెంబర్ ప్లేట్లలో ఇక టీఎస్ రాదు.. టీజీ!
ఒక వాహనం నంబర్ ప్లేట్ పై టీఎస్ అని ఉంటే మనం దాన్ని తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనం అని గుర్తిస్తాం. అయితే ఇప్పుడు ఈ రాష్ట్ర నెంబర్ ప్లేట్లపై టీఎస్‌కి బదులుగా టీజీ రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
‘TG’ number plates : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలు ఇకపై టీజీ(TG) అనే నెంబర్ ప్లేట్‌తో దర్శనం ఇవ్వనున్నాయి. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణా శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారులను ఉపయోగించి పాత గెజిట్ నోటిఫికేషన్లో ఈ మార్పు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
సవరించిన ఈ గెజిట్ నోటిఫికేషన్లో భాగంగా సీరియల్ నెంబర్ 29ఏగాను, టీఎస్‌కి బదులుగా టీజీగానూ ఇకపై నెంబర్ ప్లేట్లు వస్తాయని రవాణా శాఖ పేర్కొంది. తెలంగాణలో(Telangana) కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి(revanth reddy) సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ మార్క్‌లో మార్పు చేయాలని భావించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా నంబర్ ప్లేట్లోని టీఎస్(TS)ని టీజీగా మారుస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇక మీదట కొత్తగా జరిగే వాహన రిజిస్ట్రేషన్లు అన్నింటికీ టీజీ(TG) నెంబర్ ప్లేట్లు మాత్రమే వస్తాయి. అయితే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయంపై ఇంకా స్పష్టమైన సమాచారం తెలియరాలేదు. అయితే పాత రిజిస్ట్రేషన్లలో టీఎస్ అని ఉన్న వారు కూడా తమ నెంబర్ ప్లేట్లను మార్చుకోవాలా? అనే అనుమానం చాలా మందికి వస్తోంది. అలాంటిది ఏమీ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక మీదట కొత్తగా వచ్చే నెంబర్ ప్లేట్లలో మాత్రం ఈ మార్పులు కనిపిస్తాయని వెల్లడించింది.