గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు.విజయదశమి రోజున ఆయుధ పూజ (Ayudha Puja) సందర్భంగా నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో మంగళ్‌హట్ పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు. విధ్వేష ప్రసంగానికి సంబంధించి రెండు విచారణా నోటీసులు ఆయనకు జారీ చేశారు. కాగా తుపాకులు, కత్తులు ప్రదర్శించి రాజా సింగ్ పూజలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social media)లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16న రాజా సింగ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో విధ్వేషపూరిత ప్రసంగం ఉందని పోలీసులు తెలిపారు. నవరాత్రి దాండియా (Dandiya) కార్యక్రమాలు, వేడుకలకు ముస్లింలను అనుమతించవద్దని నిర్వహకులను రాజాసింగ్ కోరారు.
అంతేకాదు కార్యక్రమానికి హాజరైన వారందరి గుర్తింపు కార్డులను పరిశీలించాలని, ఈవెంట్(Event)కోసం ముస్లిం బౌన్సర్లు, వీడియోగ్రాఫర్లు, డీజే (DJ) నిర్వాహకులు లేదా ఇతర వ్యక్తులను నియమించుకోవద్దని వీడియోలోపెర్కొన్నారు. ఈ వీడియోపై స్థానిక లీడర్ ఎంఏ సమద్ వార్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 153ఏ, 295ఏ, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నోటీసులు జారీ చేసిందని రాజాసింగ్ చెబుతున్నారు. కేసీఆర్ కూడా దసరా రోజున ఆయుధ పూజ చేశారని, పోలీసులు (Police) ఆయనకు కూడా నోటీసులు జారీ చేస్తారా? అని ప్రశ్నించారు.సీఎం తనను వేధించాలని చూస్తున్నారని, ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యేలా చూడాలని భావిస్తున్నారని ఆరోపించారు. గతంలో రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం పీడీ యాక్టు (PD Act) నమోదు చేసింది. ఈ కేసులో చాలారోజులు జైల్లో ఉన్న ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది