Vikas Raj: గతంతో పోల్చితే తగ్గిన 3 శాతం పోలింగ్, యాదాద్రి జిల్లాలో అత్యధిక ఓటింగ్
తెలంగాణ రాష్ట్రంలో 2018తో పోలిస్తే 3 శాతం పోలింగ్ తగ్గిందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా, యాకత్ పుర నియోజకవర్గాల్లో అత్యల్ప పోలింగ్ నమోదైందని వివరించారు.
Vikas Raj: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 49 కేంద్రాలకు ఈవీఎంలు చేరుకున్నాయి. ఎన్నికల విధానంపై సీఈవో వికాస్ రాజ్ (Vikas Raj) మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పారు. 18-19 ఏళ్ల యువత 3.06 శాతం మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 70.74 శాతం పోలింగ్ జరిగిందని వివరించారు. 2018లో 73.37 శాతం నమోదు కాగా.. 3 శాతం ఓటింగ్ తగ్గింది.
లక్షా 80 వేల మంది పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేశారని వికాస్ రాజ్ (Vikas Raj) పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ జరిగింది. ఎప్పటిలాగే హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 46.68 శాతం నమోదైంది. రాష్ట్రంలో రీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఎక్కడ లేదని చెప్పారు.
ఇక నియోజకవర్గాల వారీగా ఓటింగ్ పోలింగ్ పరిశీలిస్తే.. మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం.. యాకత్ పురలో అత్యల్పంగా 39.6 శాతం పోలింగ్ నమోదైంది. 80 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించామని సీఈవో వికాస్ రాజ్ (Vikas Raj) తెలిపారు. ఈ నెల 3వ తేదీన (ఆదివారం) 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేశారు. ఆదివారం ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. ఇప్పటివరకు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ అధికారం చేపట్టనుందని ప్రకటించాయి. అధికార బీఆర్ఎస్ విపక్షానికే పరిమితం కానుందని తెలిపింది.