»Mp K Prabhakar Reddy Health Bulletin Released Cm Kcr Responded
MP K Prabhakar Reddy: హెల్త్ బులెటిన్ విడుదల..స్పందించిన సీఎం కేసీఆర్
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఆయన గాయమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. తాజాగా వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. దాడి ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని సూరంపల్లిలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన నేడు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఎంపీపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి కడుపు భాగంలో తీవ్రంగా గాయం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయనకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. మొదట గజ్వేల్‌లో ఆయన ప్రాథమిక చికిత్స చేశారు.
ఎంపీ ప్రభాకర్ రెడ్డికి కడుపు భాగంలో ఐదు కుట్లు పడినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న పలువురు బీఆర్ఎస్ నేతలు షాక్ అయ్యారు. మంత్రి హరీశ్ రావు ఫోన్ ద్వారా ఎంపీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రాజు అనే వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
కత్తితో దాడి చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. సంఘటనా స్థలంలోనే ఆ వ్యక్తిని చితకబాదారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఎంపీపై ఆ వ్యక్తి దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎంపీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
స్పందించిన కేసీఆర్:
ఈ దాడి సంఘటనపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలు ఎదుర్కోలేని చేతగాని దద్దమ్మ పార్టీలు, చేతగాని వెధవలు దాడి చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జుక్కల్‌లో ఉన్నప్పుడే తనకు సమాచారం వచ్చిందని, వెంటనే వెళ్లాలనుకున్నానని, అయితే ఎంపీ ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం లేదని మంత్రులు చెప్పడంతో ఆగిపోయినట్లుగా సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సంఘటనపై బాన్సువాడ సభలో కేసీఆర్ నిప్పులు చెరిగారు. నిందితులను వదిలిపెట్టేది లేదన్నారు.