పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో నిరాశ చెందిన ఆయన బీఆర్ఎస్లో చేరడం ఖాయమని తెలుస్తుంది. మంత్రి హరీశ్ రావు అతని ఇంటికి వెళ్లి బీఆర్ఎస్లోకి చేరమని ఆహ్వానించారు.
PJR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో టికెట్ ఆశించిన తర్వాత రాకపోవడంతో నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరేందుకు రెడీ అయ్యారు. మంత్రి హరీశ్ రావు, సీఎం కేసీఆర్తో ఇదివరకే విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడారు. మంత్రి హరీశ్ రావు మరోసారి అతనితో చర్చలు జరిపారు. ఆయన నివాసానికి వెళ్లి విష్ణువర్ధన్ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంట నగరాల్లో పీజేఆర్ అంటే తెలియని వారు ఉండరు. కార్మిక పక్షపాతిగా ఆయన ప్రజలకు చేసిన సేవ గురించి అందరికీ తెలిసిందే. పేదల కోసం పీజేఆర్ చాలా కష్టపడి పనిచేశారు. కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్ అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పార్టీ కొంతమంది దుండగుల చేతుల్లోకి వెళ్లింది. న్యాయంగా పనిచేసే నేతలకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అన్యాయం జరుగుతుందని హరీశ్ తెలిపారు. గతంలో విష్ణుతో కలిసి అసెంబ్లీలో పనిచేశామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తరఫున నిల్చున్నారు. పులిచింతల, పోలవరం, పోతిరెడ్డి పాడులకు విష్ణువర్థన్ వ్యతిరేకంగా పోరాడారు. ఈ విషయం మాకు గుర్తుంది. అప్పట్లోనే అతనిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించామని హరీశ్ రావు తెలిపారు.
బీఆర్ఎస్లో విష్ణువర్థన్ చేరడం ఖాయమనే తెలుస్తుంది. త్వరలోనే అతను గులాబీ కండువా కప్పుకుంటారని హరీశ్ రావు తెలిపారు. పార్టీలో అతని గౌరవానికి తగిన స్థానం ఇస్తామని తెలిపారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలు రూ.50లక్షలు చెల్లిస్తూ దొరికిన దొంగ.. కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ సాధించిన వారికి, ద్రోహులకు మధ్య పోరాటం జరుగుతుంది. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధపడిన చరిత్ర కేసీఆర్కు ఉందని హరీశ్ రావు అన్నారు.