ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా నడుస్తున్న టాప్ ఏంటి అంటే… కాస్తో కూస్తో రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారు ఎవరైనా.. టీఆర్ఎస్ పార్టీ మార్పు అనే చెబుతారు. సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా… టీఆర్ఎస్( తెలంగాణ రాష్టీయ సమితి) కాస్త… బీఆర్ఎస్( భారత్ రాష్ట్రీయ సమితి) గా మార్చారు. అయితే… ఇప్పటి వరకు టీఆర్ఎస్ జనాల్లో బాగా నానిన పేరును ఇప్పటి నుంచి జనాలు బీఆర్ఎస్ గా గుర్తుంచుకోవడం మొదలుపెట్టాలి. నిజానికి ఈ పేరుకు అలవాటు కావడానికి కాస్తంత సమయం పడుతుందనే చెప్పాలి. జనాలకు సమయం పట్టడం అంటే పర్లేదు. కానీ సొంత పార్టీ నేతలు… అందులోనూ మంత్రి హోదాలో ఉన్నవారికి కూడా అదే పరిస్థితి ఎదురైతే.. మంత్రి ఎర్రబెల్లి విషయంలో ఇదే జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ పేరుపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరిచిపోయి నోరు జారారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఎస్పీగా మార్చారంటూ మంత్రి అన్నారు. టీఆర్ఎర్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు అని చెప్పే బదులు కేసీఆర్ బీఎస్పీని ప్రకటించారని పేర్కొన్నారు. ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.
తొర్రూరులోని యతిరాజారావు పార్క్ లో జరిగిన దసరా ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఏ పార్టీ పెట్టారంటూ పార్టీ కార్యకర్తలను వేదికపై నుంచి ఎర్రబెల్లి ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న ఓ కార్యకర్త బీఎస్పీ అని చెప్పడంతో మంత్రి కూడా బీఎస్పీ అని చెప్పడం గమనార్హం. సొంత పార్టీ మంత్రిగారే పేరు మర్చిపోతే ఎలా అనే కామెంట్లు వినపడుతున్నాయి.