ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీ నేతలకు దమ్ముంటే పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు తాము కూడా ముందస్తు ఎన్నికలకు వస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎవరేంటో ప్రజలే తేలుస్తారన్నారు.
ఇది బీజేపీకి చివరి బడ్జెట్. పెట్టేది ఏదో పెద్దలకు అనుకూలంగా కాదు.. పేదలకు అనుకూలంగా పెట్టండి. పేదల సంక్షేమానికి పెద్ద పీట వేయండి. రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేయండి. ఉచిత కరెంట్ ను దేశమంతా ఇవ్వండి. తెలంగాణకు విద్యా సంస్థలను ఇవ్వండి. మా నిజామాబాద్ కు పసుపు బోర్డును ఇకనైనా ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఈ బడ్జెట్ లో అయినా తెలంగాణకు న్యాయం చేయండి. మీరు ప్రారంభించిన పీఎం కిసాన్ పథకాన్ని రైతు బంధులా విస్తరించి ఎకరానికి రూ.5 వేలు ఇవ్వాలి. ప్రతి పంటకు రూ.5 వేలు.. సంవత్సరానికి రూ.10 వేలు ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ లో పర్యటించిన మంత్రి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నెల రోజుల్లో ఐటీ హబ్, న్యాక్ భవనాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.936 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్రం నుంచి ఎంపీ అర్వింద్ ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. పన్నుల రూపంలో మనం కట్టిన డబ్బులను బీజేపీ పాలక రాష్ట్రాల్లో వాడుకుంటున్నారని, తాను చెప్పింది తప్పు అయితే రాజీనామాకు కూడా సిద్ధం అని.. మనం రూపాయి ఇస్తే మనకు 46 పైసలు మాత్రమే ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించామని స్పష్టం చేశారు.