Konda Murali: తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. వరంగల్ జిల్లాలో కొండా మురళి (Konda Murali) వర్సెస్ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. మంత్రి కేటీఆర్ గురించి కొండా మురళి కామెంట్స్ చేయడంతో ధర్మారెడ్డి స్పందించారు. ఆ కామెంట్లకు కౌంటర్‌గా ఈ రోజు కొండా మురళి మీడియా ముందుకు వచ్చారు. ధర్మారెడ్డి మట్టి దొంగ అని విమర్శించారు. చెరువుల్లో మట్టి తోడుతున్నారని మండిపడ్డారు. మహిళలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా ఇంటి గేటు తెలుసా..?
నా ఇంటి గేటు తెలుసా నీకు అంటూ ధర్మారెడ్డిని కొండా మురళి నిలదీశారు. గతంలో ప్రగతి సింగారంలో బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం తన ఇంటిచుట్టూ మూడు రోజుల పాటు తిరిగాడని కొండా మురళి చెప్పారు. ఫస్ట్ దయాకర్, ఆ తర్వాత శ్రీహరి పంచన చేరి రాజకీయంగా పైకొచ్చాడని విమర్శించారు. పార్టీలు మారుతూ పైకొచ్చిన ధర్మారెడ్డికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. గతంలో మహిళా సర్పంచ్ సౌజన్యను ధర్మారెడ్డి అవమానిస్తే తన దగ్గరకు వచ్చి విలపించిందని తెలిపారు. సౌజన్యను ఎంపీపీ చేస్తానని ఆ రోజే చెప్పానని, చెప్పినట్లే ఎంపీపీని చేశానని కొండా మురళి వివరించారు.
ఖబడ్దార్ అంటూ
ధర్మారెడ్డి అరాచకాలు భరించలేక కార్యకర్తలు తన వెంట వస్తానని అంటున్నారని కొండా మురళి (Konda Murali) తెలిపారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ ఏ అభివృద్ది పనులు చేసిందో అందరికీ తెలుసు అని చెప్పారు. తమ పార్టీ నుంచి జిల్లాలో ఉన్న బీసీలు ముగ్గురం అని గుర్తుచేశారు. కొండా సురేఖ, కొండా మురళి, పొన్నాల లక్ష్మయ్య అని పేర్కొన్నారు. సురేఖకు తూర్పు.. తనకు పరకాల సీటు వస్తోందని ధీమాతో ఉన్నారు. పరకాల వెళతా.. ప్రచారం చేస్తా.. దమ్ముంటే ఆపు అని సవాల్ విసిరారు. ఒకవేళ తనకు టికెట్ రాకున్నా సరే.. పరకాలలో ధర్మారెడ్డిని ఓడిస్తానని శపథం చేశారు. మైసమ్మ సాక్షిగా ధర్మారెడ్డిని ఓడిస్తానని ప్రతీన చేశారు. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
శ్రీకృష్ణ దేవరాయలు
కొండా మురళి భయపడెటోడు కాదన్నారు. కేసీఆర్, కేటీఆర్ మెప్పు పొందేందుకు కామెంట్స్ చేస్తున్నావని.. అందరికీ తెలుసు అని చెప్పారు. తాను బ్రాహ్మణుల కాళ్లు మొక్కానని.. సన్యాసుల కాళ్లు మొక్కబోనని కొండా మురళి తేల్చిచెప్పారు. తమది కాపు కులం అని.. శ్రీకృష్ణ దేవరాయల తమ కులానికి చెందినవారు అని గుర్తుచేశారు. ఇతరులు ఆయన పేరును స్మరించే అర్హత లేదన్నారు. చెంచాగిరి అనేది టీఆర్ఎస్ పార్టీలో మొదలైందని.. ఆ పార్టీలో దొరలు ఉంటారని, కాళ్లు మొక్కించుకుంటారని పేర్కొన్నారు. అలా చేస్తేనే టికెట్లు వస్తాయని తెలిపారు. మేం కాళ్లు మొక్కం, ఆ అవసరం రాలే, రానీయ అని స్పష్టంచేశారు.
అండ దండ
కార్యకర్తలకు అండగా ఉండేవాడు కొండా మురళి అని స్పష్టంచేశారు. ధర్మారెడ్డికి అంత సీన్ లేదన్నారు. కొండా మురళి, కొండా సురేఖ, కొండా సుష్మిత పటేల్.. కార్యకర్తలకు రక్షణగా ఉంటారని తెలిపారు.