తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర రాజకీయాలపై దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బిహార్ పర్యటనకు వెళ్లిన ఆయన తర్వాత… యూపీ పర్యటనకు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి మరీ.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆయన.. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల బిహార్ పర్యటన పూర్తి చేసుకున్న ఆయన.. ఉత్తరప్రదేశ్ లో భారీ సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పలుమార్లు కేసీఆర్ తో సమావేశమన విషయం తెలిసిందే. యూపీ పర్యటనలో భారీ బహిరంగ సభ గురించి సమాజ్ వాదీ పార్టీ అగ్రనేతలతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోనే బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహించే సభలో బీజేపీ వ్యతిరేక కూటమి నేతలు పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కేసీఆర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు సంబంధించి త్వరలోనే అధికారికంగా టీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించే అవకాశం ఉంది.
ఈ నెల 3వ తేదీన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ ఏ రకమైన పాత్ర పోషించనుందో వివరించనున్నారు. ఈ నెల 3వ తేదీ తర్వాత ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతున్నట్లు సమాచారం.
2024 లో జరిగే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారానికి దూరం చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల నేతలు, సీఎంలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.