బీఆర్ఎస్ తో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. నిజానికి ప్రస్తుతం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలంతా.. జాతీయ పార్టీ హడావిడిలో ఉన్నారు. ఈ సమయంలో అనుకోకుండా వివాదంలో పడ్డారు. అది కూడా ఓ సెన్సిటివ్ మ్యాటర్ లో కావడం గమనార్హం.
ఇంతకీ మ్యాటరేంటంటే… దసరా పండగ రోజున పాల పిట్టను చూస్తే మంచి జరుగుతుందని మనం చిన్నతనం నుంచి వింటున్నదే. దాదాపు అందరూ ఆ రోజు సాయంత్రం పాలపిట్ట ఎక్కడ కనపడుతుందా అని చూస్తూఉంటారు. సీఎం కేసీఆర్ కూడా ఆ రోజు పాల పిట్టను చూడాలని అనుకున్నారు. అయితే.. సీఎం కదా.. బయటకు వెళ్లి చూసే అవకాశం పెద్దగా ఉండదు. భద్రత సమస్యలు వస్తాయి. అందులోనూ ఈ బీఆర్ఎస్ బిజీలో ఉండటంతో తాను పాలపిట్టను చూడాలని అనుకుంటున్నట్లు అధికారులకు చెప్పారు.
ఆయన చెప్పినట్లే అధికారులు కూడా పాలపిట్టను పంజరంలో పెట్టిమరీ తీసుకువచ్చి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులకు చూపించారు. ఆ ఫోటోలు వైరల్ కావడంతో ఇప్పుడు వివాదం మొదలైంది.
పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అలాంటి రాష్ట్ర పక్షిని సీఎం చూడాలి అన్నారు కదా అని పంజరంలో బంధించడం ఏంటి..? ఈ లాజిక్ కేసీఆర్ ఎలా మిస్ అయ్యారనే ప్రశ్నలు మొదలౌతున్నాయి.
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఎవ్వరూ పాలపిట్టను బంధించకూడదు. అలాంటి ఘటన చోటు చేసుకొంటే అది నేరంగా గుర్తించబడతారు.
దసరా రోజును సీఎం కేసిఆర్ మెప్పు పొందేందుకు ఏకంగా అటవీ శాఖాధికారులు పాలపిట్టను పంజరంలో బంధించి తెచ్చారు. దాన్ని కేసిఆర్ దండం పెడుతుండగా ఫోటోలు తీసి అందరికి షేర్ చేసుకొన్నారు. ఇది కాస్తా వివాదానికి దారితీసింది. పాలపిట్టను పంజరంలో బంధించిన విషయం తెలుసుకొన్న పక్షి ప్రేమికులు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యాక్ట్ ఉల్లాంఘనలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకునేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా వైల్డ్ లైఫ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి వైల్డ్ లైఫ్ బోర్డు చైర్మన్గా సీఎం కేసీఆర్ ఉన్నారు. అలాంటిది ముఖ్యమంత్రి తన కోసం పాలపిట్టను బంధించి తనవద్దకు తెప్పించుకోవడాన్ని జంతుప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన సీఎం స్థాయి వ్యక్తే నిబంధనలు భేఖాతరు చేయడం పై విమర్శలు వెళ్లువెత్తున్నాయి.
సామాన్యులు ఎవరైనా తెలియక చేస్తే శిక్షలు వేస్తారు. అన్నీ తెలిసి కూడా సీఎం ఇలా చేయడం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదంపై కేసీఆర్ స్పందించి.. విమర్శలకు పులిస్టాప్ పెడతారో లేదో చూడాలి.