జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి ఇతర రాష్ట్రంలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈనెల 18న ఖమ్మం సభలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఊహించని రీతిలో విజయవంతం కావడంతో ఇక తదుపరి మిగతా రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రం.. బీజేపీ పాలిత మహారాష్ట్ర నుంచే కేసీఆర్ పొలికేక పెట్టనున్నారు. శివసేన పార్టీ చేతిలో నుంచి అప్పనంగా బీజేపీ ప్రభుత్వాన్ని లాక్కున్న మహారాష్ట్రలోనే కేసీఆర్ తదుపరి సభ నిర్వహించనున్నాడు. తెలంగాణకు సరిహద్దులోని తెలుగు ప్రాంత ప్రజలు అధికంగా ఉండే నాందేడ్ లో భారీ బహిరంగ సభ తలపెట్టారు. ఫిబ్రవరి 5వ తేదీన ఈ సభ నిర్వహణ బాధ్యతలు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీసుకున్నారు. ఈ మేరకు నాందేడ్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
నాందేడ్ లో సభ ఏర్పాట్లపై పలు సంఘాల నాయకులతో చర్చిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నాందేడ్ పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తిరుగుతున్నారు. సభ ఏర్పాట్ల కోసం వారం నుంచి అక్కడే అధికంగా ఉంటున్నారు. కిన్వట్ తాలుకాలో పర్యటించి సభకు భారీగా ప్రజలు తరలివచ్చేలా అక్కడి స్థానిక ప్రజా సంఘాల నాయకులతో చర్చిస్తున్నారు. ఈ సభలోనే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ప్రవేశించేందుకు నాందేడ్ ను ద్వారంగా బీఆర్ఎస్ భావిస్తున్నది. అక్కడ తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో ఉండడం.. తెలంగాణకు సరిహద్దు కావడంతో తెలంగాణపై అక్కడి ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. కాగా తెలంగాణ ప్రభుత్వ పథకాలు మెచ్చి నాందేడ్ పరిధిలోని పదుల సంఖ్యలో గ్రామాలు తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావును కూడా ఆయా గ్రామాల ప్రజలు కలిసి ఇదే విషయాన్ని చెప్పారు. అందుకే నాందేడ్ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ ఎంచుకున్నారు. అయితే ఈ సభకు కొంత మంది ముఖ్య నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తదితరులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని సమాచారం.