Kishan Reddy: రూ.2 వేల నోటు విత్ర డ్రాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మోడీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు రాగా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. రూ.2 వేల నోటు రీకాల్‌కు సంబంధించి తమకు ఓ ప్రణాళిక ఉందని చెప్పారు. ఆ మేరకు నడుచుకుంటామని పేర్కొన్నారు. ఏ విషయంపై అయినా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోందని వివరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) అరెస్ట్ తమ చేతుల్లో లేదని కిషన్ రెడ్డి తెలిపారు. అదీ సీబీఐ పరిధిలోని అంశం అని పేర్కొన్నారు. ఆధరాలు ఉన్నందున ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిందని వివరించారు. అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను కూడా జైలుకు పంపించామని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా తమకు ఒక్కటేనని చెప్పారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని (bjp chief) మార్చే అవకాశం లేదన్నారు. తామంతా ఓకే కుటుంబం అని.. జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవడం సహజం అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదని.. ఆ పార్టీని ఎంఐఎం నడిపిస్తోందని పేర్కొన్నారు. ఓ వార్డ్ మెంబర్ గెలిస్తేనే ఆ పార్టీ సంబరపడిపోతుందని మండిపడ్డారు.
కర్ణాటక వేరు.. తెలంగాణ వేరు అని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయం అని తెలిపారు. దేశ్ కీ నేత అని ప్లెక్సీ పెట్టించుకుంటే కేసీఆర్ దేశానికి నేత కాలేరని చెప్పారు.