Bandi Sanjay: బీఆర్ఎస్కు భూ కేటాయింపుపై బండి సంజయ్ ఆగ్రహాం
కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి భూ కేటాయింపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. వందల కోట్ల విలువచేసే భూమిని ప్రభుత్వం అప్పనంగా బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిందని ఆరోపించారు.
Bandi Sanjay: హెచ్ఎండీఏ భూముల అమ్మకంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. అక్కడ భూమి ధర ఎక్కువగా ఉందని.. తక్కువ ధరకు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం కట్టబెట్టిందని ఆరోపించారు. గజం రూ.లక్ష పైగా ఉందని.. కానీ ప్రభుత్వం మాత్రం రూ.7500 గజం అమ్మాలని చూస్తోందని మండిపడ్డారు.
మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఎకరం రూ.100 కోట్లకు పైగా రావాలని బండి సంజయ్ తెలిపారు. మొత్తం 11 ఎకరాలకు రూ.1300 కోట్లు రావాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి భూమి కేటాయించి.. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ అంశంపై తమ నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట (kokapet) గ్రామంలో 239, 240 సర్వే నంబర్లలో 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి బదలాయించాలని ఇటీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ భేటీలో భూ పరిపాలన శాఖ ప్రతిపాదన చేయగా.. మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం జరిగిన మంత్రి హరీశ్ రావు (Harish Rao) క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. 111 జీవో రద్దు, వీఆర్ఏల రెగ్యులరైజేషన్ అంటూ పలు అంశాలను ప్రకటించారు. బీఆర్ఎస్ భూమి కేటాయింపు అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. భూమి కావాలని బీఆర్ఎస్ ప్రతిపాదన.. రెవెన్యూ శాఖ అంగీకారం.. మంత్రివర్గం ముందు నోట్ పెట్టడం.. మంత్రివర్గం ఆమోదం గురించి తెలియజేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
వాస్తవానికి కోకాపేటలో ధరలు ఎక్కువగా ఉన్నాయి. భూ పరిపాలన శాఖ ప్రతిపాదన మేరకు క్యాబినెట్ రూ.40 కోట్లు చెల్లించేలా ఆమోదించింది. దీంతో అధికార పార్టీ రూ.460 కోట్ల తక్కువకు భూమిని దక్కించుకుంది. కానీ ఆ భూమి రూ. 1300 కోట్ల విలువ చేస్తోందని బండి సంజయ్ అన్నారు.