Kamareddy: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్ (kcr) పోటీపై అందరికీ సందేహాలు తలెత్తాయి. మరో చోట నుంచి ఎందుకు..? అందులో కామారెడ్డిని (kamareddy) ఎందుకు ఎంపిక చేసుకున్నారనే ప్రశ్నలు తలెత్తాయి.. వాటికి మంత్రి కేటీఆర్ (ktr) సమాధానం ఇచ్చారు.
కామారెడ్డి నియోజకవర్గం తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తి నింపిందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. 2004లో పొత్తులో భాగంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ నాడు గంప గోవర్ధన్ పార్టీలోకి రావడంతో బలం పెరిగిందని చెప్పారు. అప్పటి నుంచి వరసగా 4 సార్లు గెలుస్తూ వచ్చారని వివరించారు. అభివృద్ధిలో కామారెడ్డి దూసుకెళ్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేసి, గెలవడంతో రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గం కానుందని తెలిపారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న.. వెనక బలమైన కారణం ఉంటుందని తెలిపారు.
కామారెడ్డి నుంచి బరిలోకి దిగమని సీఎం కేసీఆర్‌ను గంప గోవర్ధన్ అడిగారని కేటీఆర్ వివరించారు. ఆయన విజ్ఞప్తితో కేసీఆర్ పోటీ చేస్తున్నారని తెలిపారు. అంతే తప్ప ఇందులో మరే కారణం లేదన్నారు. కామారెడ్డి- సిరిసిల్ల నియోజకవర్గం పక్కన ఉంటుంది. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు, ఇటు కామారెడ్డిలో కేసీఆర్ బరిలోకి దిగడంతో ఆ మూడు ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని లెక్కలు వేసుకొని బరిలోకి దిగుతున్నారు.
సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగడం వెనక మంత్రి కేటీఆర్ వెర్షన్ ఇలా ఉండగా.. రెండు చోట్ల పోటీ అంటే ఓడిపోతాం అనే అనుమానం అని కొందరు అంటున్నారు. లేదు.. రెండు చోట్ల గెలిచిన తర్వాత.. ఒకచోట రాజీనామా చేసి.. మరో చోట కూతురు కవిత పోటీ చేస్తారని.. తర్వాత మంత్రివర్గంలోకి కూడా వస్తారని అంచనాలు నెలకొన్నాయి. ఇవన్నీ ఊహాగానాలేనని మరికొందరు కొట్టి పారేస్తున్నారు. కానీ కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలోకి దిగడంతో హైప్ నెలకొంది.