JP Nadda: తెలంగాణ గట్టు మీద ఎన్నికల ప్రచార హోరు పెరిగింది. ప్రధాన పార్టీ నేతల మధ్య విమర్శలు కూడా ఎక్కువ అయ్యాయి. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, బండి సంజయ్, రేవంత్ రెడ్డి ప్రచారంలో నిమగ్నం అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో మాట్లాడారు.
కాంగ్రెస్, కేసీఆర్ గురించి జేపీ నడ్డా (JP Nadda) విమర్శించారు. కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ.. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి రాజ్యం ఏలుతాయని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు నిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు కావడం లేదని గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నారా అని అడిగారు.
తెలంగాణ డెవలప్ అయ్యేందుకు ప్రధాని మోడీ (modi) అధికంగా నిధులు కేటాయించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాటిని ఉపయోగించడం లేదన్నారు. ఉద్యమ ఫలాలు ప్రజలకు అందడం లేదని.. కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఆ ఫలం దక్కిందని చెప్పారు. జమ్ముకశ్మర్, బీహర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్లో కుటుంబ పార్టీలు ఉన్నాయని గుర్తుచేశారు. జమ్ములో ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, బీహర్లో లాలు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ, ఏపీలో వైఎస్ఆర్ ఫ్యామిలీ, తమిళనాడులో కరుణానిధి కుటుంబం ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ధి జరిగిందని చెప్పారు. ప్రజలకు ఏం ఒరగలేదన్నారు. ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ పేదల భూములు దోచుకున్నారని జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.