సినిమాలు తగ్గించి… తన పూర్తి దృష్టి మొత్తం రాజకీయాలపైనే పెడుతున్నాడు పవన్(pawan kalyan). అంతక ముందు ఒప్పుకున్న సినిమాలను కూడా కాస్త పక్కన పెట్టిమరీ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. అయితే.. ఈసారి కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా.. తెలంగాణలోనూ తమ పార్టీ మార్క్ చూపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పవన్ సూపర్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేలా జనసేనాని తెలంగాణకు సంబంధించి వ్యూహ రచన చేస్తున్నారట. ఇందులో మెజార్టీ నియోజకవర్గాలు గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో వుండేందుకు అవకాశముంది.
కాగా, రెండు లేదా మూడు లోక్ సభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలన్న దిశగా జనసేన పార్టీ పావులు కదుపుతోంది. అసలు తెలంగాణలో జనసేన పార్టీకి సరైన నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే, జనసేన పేరుతో అడపా దడపా పలు నిరసన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం తప్ప.. నిఖార్సుగా పార్టీ కార్యకలాపాలు చేపట్టే నాయకులెవరూ లేరని అందరికీ తెలిసిన విషయమే.
మరి నాయకులు లేకుండా తెలంగాణలో జనసేన ఏ ధైర్యంతో రంగంలోకి దిగుతోంది అంటే.. దానికి కూడా సమాధానం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి జాతీయ పార్టీ బీఆర్ఎస్ విషయమై తాము అనుకున్నది సాధిస్తామన్న ఆలోచన తెలంగాణ రాష్ట్ర సమితిలో వుంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా మారితే.. జనసేనకే కాదు, తెలుగుదేశం పార్టీకీ కూడా తెలంగాణలో కొంత సానుకూల పరిస్థితులు వుంటాయి.
దాంతోపాటుగా, తెలంగాణ రాష్ట్ర సమితితో కొంత సానుకూలంగా వుంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఓ రెండు లోక్ సభ నియోజకవర్గాల్ని జనసేన పార్టీ, టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాధానం వినపడుతోంది.