అసెంబ్లీ హాల్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయిన జగ్గారెడ్డి దాదాపు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. దీంతో అసలు ఏం జరిగిందని అందరూ ఆశ్చర్యపోయారు. మీడియా ముందుకు వచ్చిన జగ్గారెడ్డి తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని..
Jaggareddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దూకుడు మీదున్నారు. ఎందుకంటే.. బీఆర్ఎస్ నేతలతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతోంది. అసెంబ్లీలోనే మొన్న సీఎం కేసీఆర్ తో జగ్గారెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి హరీశ్ రావుతోనూ జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయిన జగ్గారెడ్డి దాదాపు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. దీంతో అసలు ఏం జరిగిందని అందరూ ఆశ్చర్యపోయారు. మీడియా ముందుకు వచ్చిన జగ్గారెడ్డి తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యానని చెప్పారు.
కట్ చేస్తే తాజాగా మంత్రి హరీశ్ రావుతోనూ జగ్గారెడ్డి భేటీ అవడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్స్ ఇవ్వాలని మంత్రిని కోరారు. సంగారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనుల కోసం ఫండ్స్ ఇవ్వాలని మంత్రిని జగ్గారెడ్డి కోరారు. ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ కింద రూ.5.5 కోట్లు ఇవ్వాలని, సంగారెడ్డిలోని ఫాతే ఖాన్ దర్గా అభివృద్ధి కోసం రూ.3 కోట్లు, ఈద్గా అభివృద్ధి కోసం రూ.5 కోట్లు, దీన్ దార్ ఖాన్ ఫంక్షన్ హాల్ అభివృద్ధి కోసం రూ.5 కోట్లను ప్రభుత్వం కేటాయించాలని జగ్గారెడ్డి మంత్రిని కోరారు.
Jaggareddy : స్మశాన వాటికలకు స్థలాలు మంజూరు చేయండి
సంగారెడ్డిలో ఆయా మతాలకు స్మశాన వాటికలను మంజూరు చేయాలని జగ్గారెడ్డి.. మంత్రిని కోరారు. సీఎస్ఐ చర్చి అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలన్నారు. శివాలయం నిర్మాణానికి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలన్నారు. సీఎం కేసీఆర్ ను కలిసినప్పుడు కూడా నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ ను కోరారు. రెండు రోజుల తర్వాత ప్రగతి భవన్ కు వచ్చి తానే స్వయంగా వినతి పత్రం సమర్పిస్తానని కూడా మీడియాకు తెలిపారు జగ్గారెడ్డి. తాజాగా మంత్రి హరీశ్ రావును కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై వినతి పత్రం సమర్పించారు. అయితే.. జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లడం కాంగ్రెస్ పార్టీలో అలజడి లేపింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెబుతున్నారు కానీ.. జగ్గారెడ్డి.. కేసీఆర్, హరీశ్ రావును కలవడానికి వేరే కారణం ఏదైనా ఉండొచ్చు కానీ.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జగ్గారెడ్డి త్వరలోనే పార్టీ మారరని ఏంటి గ్యారెంటీ అంటూ పలువురు కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ లో ఎలాగూ జగ్గారెడ్డి అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డికి ఆయనకు అస్సలు పడటం లేదు. అందుకే.. జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి దగ్గరవుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. నిజానికి.. జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు చాలా రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. కానీ.. ఆయన ఎప్పుడు పార్టీ మారుతారు అనేదానిపై మాత్రం స్పష్టత లేదు.