»Good News For Auto Drivers Ktrs Announcement That He Will Cancel Those Charges
KTR: ఆటో డ్రైవర్లకు తీపికబురు..ఆ చార్జీలు రద్దు చేస్తానని కేటీఆర్ ప్రకటన
ఆటో డ్రైవర్లకు ఒకే రోజు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ శుభవార్తలు చెప్పారు. ఆటో డ్రైవర్ల ఫిట్నెస్, సిర్టిఫికెట్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే యాదాద్రిగుట్టపైకి ఆటోలు నడిపేందుకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అనుమతులు ఇస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల (Telangana Elections) నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మూడోసారి అధికారంలోకి రావడం కోసం అన్ని వర్గాల వారిని ఆకర్షించేందుకు పలు హామీలను ఇస్తోంది. తాాజాగా బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లకు (Auto drivers) తీపికబురు చెప్పింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలు నడిపేందుకు అనుమతులు ఇవ్వనున్నట్లు మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. తాము అధికారం చేపట్టిన వెంటనే డిసెంబర్ 3వ తేది నుంచి అనుమతులు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకూ యాదాద్రి కొండపైకి బస్సులు మాత్రమే వెళ్లేవని, తాము అధికారంలోకి రాగానే ఆటోలను కూడా కొండపైకి వెళ్లేలా అనుమతులు జారీ చేస్తామని కేటీఆర్ మాట ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఆయన ఆలేరు (Aleru) నియోజకవర్గంలో పర్యటించారు. తమ పార్టీ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గెలుపు కోసం యాదగిరిగుట్టలో నేడు రోడ్ షోను నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ..ఆలేరులో సునితక్క గెలవడం పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రిని అద్భుతంగా నిర్మించామని, ఓవైసీ కూడా యాదాద్రిని అద్భుతంగా ఉందని చెప్పినట్లు గుర్తు చేశారు. ఆలేరుకు కాళేశ్వరం బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల ద్వారా గోదావరి నీళ్లను అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
మరోవైపు సీఎం కేసీఆర్ (Cm KCR) కూడా మానకొండూరు ప్రజా ఆశీర్వాద సభలో ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. ఆటో డ్రైవర్ల ఫిట్నెస్, సర్టిఫికెట్ చార్జీలను రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆటో డ్రైవర్లను ఆకర్షించేలా నేడు ఒకే రోజు అటు కేటీఆర్, ఇటు కేసీఆర్ హామీలు ఇవ్వడంతో ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ నేతలు మాత్రం తమ మేనిఫెస్టోను కాపీ కొట్టినట్లుగా విమర్శిస్తున్నారు.