Election Commission: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విడుదలకు అనుమతివ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది. పెండింగ్ డీఏలు ఎన్నికల కోడ్ సమయంలో ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఈసీ. దీంతో పాటు రైతుబంధు, రైతు రుణమాఫీలకు సంబంధించిన నిధుల విడుదలకు కూడా అనుమతి నిరాకరించింది. ఇది ఇలా ఉంటే తెలంగాణ శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.625 కోట్లను దాటింది. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఇప్పటివరకు రూ.625 కోట్ల 79 లక్షలకుపైగా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు.
గడచిన 24 గంటల్లో 18 కోట్ల 64 లక్షలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు స్వాధీనమైన మొత్తం 232 కోట్లా72 లక్షలకుపైగా ఉందని ఆయన వెల్లడించారు. 180 కోట్ల 60 లక్షలకుపైగా విలువైన బంగారం, ఇతర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.99 కోట్ల 49 లక్షలకు పైగా ఉండగా.. మత్తు పదార్థాల విలువ రూ.34కోట్ల 35 లక్షలకుపైగా ఉంది. వాటితోపాటు రూ.78 కోట్ల 62 లక్షలకుపైగా విలువైన ఇతర వస్తువులు పట్టుబడినట్లు వికాస్‌రాజ్ వివరించారు.