పోలీసు వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరొకరు గాయపడగా ప్రస్తుతం ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. ప్రధాని మోదీ సభకు బందోబస్తుగా పోలీసులు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఆరుగురు పోలీసులు దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ (Rajasthan)లోని చురు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చురు జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ ట్రక్స్ ఆగి ఉంది. ఆగి ఉన్న ట్రక్కును పోలీసు వాహనం ఢీకొంది. దీంతో వాహనంలో ఉన్న ఆరుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.
సుజన్గఢ్ సర్కిల్ అధికారి షకీల్ ఖాన్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సభ కోసం పోలీసులు బందోబస్తుగా వెళ్తున్నారు. మార్గంమధ్యలో కనోటా చెక్పోస్ట్ వద్ద నేషనల్ హైవే 58 వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసు వాహనం డ్రైవర్ ఎదురుగా వస్తోన్న వాహనాన్ని ఢీకొట్టకుండా ఆపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పోలీసు వాహనం అదుపు తప్పి పక్కనే ఆగి ఉన్న ఓ ట్రక్కను ఢీకొంది. వాహనంలో ఉన్న ఆరుగురు పోలీసులు దుర్మరణం చెందారు.
చనిపోయిన వారిలో ఎఎస్ఐ రాంచంద్ర, కానిస్టేబుళ్లు కుంభారం, సురేష్ మీనా, తానారామ్, మహేంద్ర, సుఖరామ్లు ఉన్నారు. వీరంతా ప్రమాదంలో గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డీజీపీ ఉమేష్ మిశ్రా స్పందించారు. మృతులకు సంతాపం తెలియజేశారు. అధికార లాంఛనాల మధ్య వారి అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు.