»Foxconn Factory To Manufacture Apple Airpods Is Going To Start In Telangana
Apple AirPods: ఇకపై యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారీ హైదరాబాద్‌లోనే!
స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ ఎయిర్‌పాడ్స్ ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. ఎయిర్ పాడ్స్లల్లో దిగ్గజ కంపెనీ అయిన యాపిల్ అంటే అందరికీ ఇష్టమే. ఇకపై ఆ సంస్థ ఎయిర్‌పాడ్స్ మన దగ్గరే తయారు కానున్నాయి. దీంతో వాటి రేట్లు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని వినియోగదారులు సంబరాలు చేసుకుంటున్నారు.
Foxconn factory to manufacture Apple AirPods is going to start in Telangana
Apple AirPods: ప్రముఖ కంపెనీల ఎయిర్‌పాడ్స్‌ను తయారు చేసే ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ ఇప్పుడు హైదరాబాద్‌కు రాబోతోంది. యాపిల్ ఎయిర్‌పాడ్స్ అన్నీ ఇకపై మన హైదరాబాద్‌లోనే తయారు కానున్నాయి. వచ్చే సంవత్సరం డిసెంబర్ నుంచి ఐఫోన్ కంపెనీ యాపిల్ తమ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తిని తెలంగాణ ప్రాంతంలో ప్రారంభించనుందని సంబంధిత వర్గాలు పీటీఐకి తెలిపాయి. 3 నెలల క్రితం మే 15న హైదరాబాద్ సమీపంలోని కొంగర కలాన్ వద్ద తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ 500 మిలియన్ డాలర్లతో మ్యాన్‌ఫ్యాక్షరింగ్ కంపెనీ శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కంపెనీ ద్వారా దాదాపుగా 25,000 ఉద్యోగావకాశాలు రానున్నట్లు పేర్కొన్నారు.
మామూలుగా అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను భారత్ కలిగి ఉంది. అందుకనే ఇక్కడ పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు ఆర్జింజవచ్చని ప్రముఖ దిగ్గజ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్ చైర్మన్, సీఈవో యంగ్ లియు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫాక్స్‌కాన్ ఇండియా వార్షిక టర్నోవర్ 10 బిలియన్ డాలర్లకు చేరువైందని ఆయన తెలిపారు. అందుకే భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించడానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఫాక్స్‌కాన్ వార్షిక రెవెన్యూ మొత్తంగా 200 బిలియన్ డాలర్లు. పెరుగుతున్న భారతీయ మార్కెట్ పరిమాణం దృష్ట్యా.. ఇక్కడ తమ వ్యాపార విస్తరణకు దిగితే ఆరంభంలోనే బిలియన్ డాలర్లలో పెట్టుబడులకు వీలుందని ఆయన వెల్లడించారు. అలాగే ప్రస్తుతం దేశీయంగా ఫాక్స్‌కాన్ దాదాపు 9 క్యాంపస్‌లను నిర్వహిస్తోందని, దేశవ్యాప్తంగా 30కిపైగా ఫ్యాక్టరీలున్నాయని, 20కిపైగా వసతి గృహాలున్నాయని, అందులో సంస్థలో పనిచేస్తున్న వేలాది ఉద్యోగులు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.
యాపిల్‌తోపాటు, నోకియా, సిస్కో, సోని, షియామీ తదితర ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థల ఉత్పత్తులను ఫాక్స్‌కాన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా యాపిల్ ఎయిర్‌పాడ్స్ కూడా ఇక్కడే తయారు చేస్తే బాగుంటుందని కంపెనీ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పూర్లెస్ ఎయిర్‌పాడ్స్‌కు మంచి డిమాండ్ ఉండడం, అందులో భారతీయ మార్కెట్ పెద్దది అవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రొడక్ట్స్ మన దగ్గరే తయారు అవుతుండడంతో వాటి ధర కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని యూజర్లు భావిస్తున్నారు. దాదాపు మార్కెట్లో సిరీస్‌లను బట్టీ రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు ఉన్న వీటి ధర ట్రాన్స్ పోర్ట్ సుంకం పోగా చాలా వరకు తగ్గనున్నాయి.