Nirmal : ఫ్యాక్టరీపై 600మంది మూకుమ్మడి దాడి.. యజమాని కారుకు నిప్పు
నిర్మల్ జిల్లా దిలవార్ పూర్ మండల కేంద్రంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపియాలంటూ ఆ గ్రామానికి చెందిన దాదాపు 600 మంది రైతులు ఫ్యాక్టరీపై దాడికి దిగారు.
Nirmal : నిర్మల్ జిల్లా దిలవార్ పూర్ మండల కేంద్రంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపియాలంటూ ఆ గ్రామానికి చెందిన దాదాపు 600 మంది రైతులు ఫ్యాక్టరీపై దాడికి దిగారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపకపోవడంతో సహనం కోల్పోయిన రైతులు బుధవారం ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్న స్థలానికి చేరుకుని అక్కడ ప్రహరీ గోడ, పిల్లర్లను ధ్వంసం చేసి గుడిసెలకు నిప్పు పెట్టారు. అంతేకాకుండా అక్కడ ఉన్న యజమాని కారుకు కూడా నిప్పు అంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాస్ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ నెలకొనడంతో లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేయడంతో ఆందోళన తీవ్రమైంది. పరిస్థితి చేయిదాటిపోవడంతో నిర్మల్ ఏఎస్పీ క్రాంతి లాల్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులను శాంతింప చేశారు. ఫ్యాక్టరీ వద్ద అల్లర్లు చెలరేగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపకపోతే గురువారం నుంచి రోడ్డుపై వంటావార్పు తోపాటు గ్రామంలో బంద్ పాటిస్తామని గ్రామస్తులు తెలిపారు.