తెలంగాణ(Telangana)లో ఎన్నికల కోడ్‌తో ఉద్యోగాల భర్తీ పరీక్షలు వాయిదా పడే అవకాశముంది. ముఖ్యంగా నవంబర్ 2,3 జరగాల్సిన గ్రూప్ -2 ఎగ్జామ్స్ (Group-2 Exams) వాయిదా పడే అవకాశం ఉంది.షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయ పరీక్షల నోటిఫికేషన్ (DSC) ప్రకారం, నవంబర్ 20-23 మధ్య స్కూల్ అసిస్టెంట్స్, పండిట్ పోస్టులు, నవంబర్ 24-30 మధ్య ఎస్జీటీ పోస్టులకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.
దీంతో, మొత్తం ఉపాధ్యాయ పరీక్షలు (Teacher Exams) వాయిదా వేస్తారా? ఆ రోజు జరగాల్సినవి మాత్రమే వాయిదా వేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్(Polling)కు రెండు మూడు రోజుల ముందు నుంచే అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై దృష్టిపెట్టాల్సి రావడంతో టీచర్ పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఇక గ్రూప్స్ విషయంలో కూడా ఇదే తరహా సందేహాలు వినిపిస్తున్నాయి. గ్రూపు-2 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కమిషన్ కొందరు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో పరీక్షకు సిబ్బంది సర్దుబాటు కష్టమని కలెక్టర్లు (Collectors) సూచించినట్లు తెలిసింది.
రిటర్నింగ్, పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ అధికారుల నియామకం సాధ్యంకాదని వివరించారు.783 గ్రూపు 2 పోస్టులకు దాదాపు 5.51 లక్షల మంది దరఖాస్తు (Applications) చేశారు. 1600 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహణకు పోలీసులు దాదాపు 25 వేల మంది, పరీక్ష సిబ్బంది 20 వేల మంది కావాలి. రవాణా ఏర్పాట్లు జరగాలి. ఒకవేళ పరీక్షను వాయిదా వేస్తే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత డిసెంబరు మూడో వారంలో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గ్రూప్-4 ఫలితాలు వెల్లడిస్తారా లేదా అన్న విషయంలో కూడా సందేహాలు నెలకొన్నాయి.