CS Shantakumari who presented silk clothes to Bhadradri Rama
Sri Rama Navami: దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి (Sri Rama Navami) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక దక్షిణాన రామ నవమి వేడుకలకు భద్రచలం ఎంతో ప్రసిద్ది చెందింది. ప్రతీ ఏట అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలు ఈ సంవత్సరం కూడా అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల నుంచే భద్రాచలంలోని రాములోరి ఆలయం భక్తులతో రద్దీగా కొనసాగుతుంది. ఇక్కడ జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను కళ్లారా చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. మిథిలా మైదానంగా చెప్పుకొనే ఆ ప్రాంతంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇక ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు అందాయి. లోక్‌సభ ఎన్నికల కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభలు ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. ఈ వేడుకను తిలకించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు అనేకమంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. శ్రీరామ నామస్మరణతో భద్రచలం వీధులన్ని మారుమోగుతున్నాయి.